హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక సందర్భంగా సీపీఐ ఎవరికి మద్ధతు ఇస్తుందనే దానిపై ఉత్కంఠ వీడింది. తమ మద్ధతు టీఆర్ఎస్‌కే ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. హైదరాబాద్‌ ముఖ్దూం భవన్‌‌లో మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మద్ధతు ఎవరికి ఇవ్వాలనే దానిపై  చర్చించారు.

ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌కి మద్ధతిచ్చినంత మాత్రాన ప్రజా సమస్యలపై పోరాటం ఆపమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు అసెంబ్లీ వరకేనని.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మాతో టచ్‌లో లేదన్నారు. హుజూర్‌నగర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్‌తో కలిసి పాల్గొంటామని చాడ తెలిపారు. 

సీపీఐ జాతీయ సహాయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ తమతో సరిగా వ్యవహరించలేదని మండిపడ్డారు. సమన్వయం చేయడంలో ఉత్తమ్ ఫెయిల్ అయ్యారని, సీపీఎం నామినేషన్ తిరస్కరించబడింది కాబట్టి మద్ధతివ్వలేకపోయామని నారాయణ స్పష్టం చేశారు. అధికార టీఆర్ఎస్‌కు మద్ధతివ్వాలని ప్రజలను కోరుతామన్నారు.     

తెలంగాణ ఏర్పడ్డనాటి నుంచి ఏ నాడు తెరాస ఇతరపార్టీల దగ్గరకు పొత్తుకోసం వెళ్ళింది లేదు. అసెంబ్లీ ఎన్నికల కోసం కానీ, పార్లమెంట్ ఎన్నికలప్పుడు కానీ తెరాస ఒంటరిగానే బరిలోకి దిగింది. 

దీనికి భిన్నంగా ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం తెరాస అగ్ర నాయకులు సిపిఐ మద్దతు కోరారు. వచ్చింది ఎవరో సాదాసీదా నాయకులు కాదు. కెసిఆర్ కి అత్యంత సన్నిహితుడైన వినోద్ కుమార్, పార్లమెంటులో తెరాస సభా పక్ష నేత నామా నాగేశ్వర్ రావు, ఇంకో సీనియర్ నేత కేశవ రావు. వీరంతా విలేఖరులతో మాట్లాడుతూ, తాము కెసిఆర్ ఆదేశానుసారమే వచ్చామని చెప్పారు. 

విచిత్రమేమిటంటే సిపిఐ తెరాస దగ్గరకు వెళ్ళలేదు. సిపిఐ కన్నా ఎన్నోరెట్లు బలమైన అధికారతెరాస పార్టీ సిపిఐ గుమ్మం తొక్కింది. కమ్యూనిస్టులను తోక పార్టీలుగా పదే పదే దుయ్యబట్టే కెసిఆర్ ఇప్పుడు అదే పార్టీ మద్దతు కోరడం చర్చనీయాంశంగా మారింది.