హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులకు సిట్ క్లీన్‌చిట్ ఇవ్వడంపై సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది.ఈ విషయమై హైకోర్టును ఆశ్రయిస్తానని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ ప్రకటించారు

also read:నయీం కేసులో సంచలనం: 25 మంది పోలీసులకు క్లీన్ చిట్, వారు వీరే..

నయీంతో సంబంధాలు కలిగి ఉన్న కొందరు పోలీస్ అధికారులు దందాలు నిర్వహించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు పోలీసులను ప్రభుత్వం విధుల నుండి తప్పించింది. అయితే ఈ విషయమై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఐజీ నాగిరెడ్డి సిట్ బృందానికి నాయకత్వం వహించారు.

ఆరోపణలు ఎదుర్కొన్న 25 మందికి క్లీన్ చిట్ ఇవ్వడంపై పలు సంఘాలు, పార్టీలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేత వి. హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని సీపీఐ నేత నారాయణ ఆదివారం నాడు ప్రకటించారు.
ఈ కేసును వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత హనుంతరావు కూడ తేల్చి చెప్పారు.

ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారంగా సిట్ ఈ సమాచారాన్ని ఆ సంస్థకు అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది.