తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. శవాల మీద నడిచి కేసీఆర్... ముఖ్యమంత్రి అయ్యారని నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. సమ్మె మొదలుపెట్టి 15రోజులు అయినా... సీఎం సమ్మె విరమింపచేసే ప్రయత్నాలు చేయలేదు. ఈ క్రమంలో సీపీఐ నారాయణ మీడియాతో మాట్లాడుతూ సీఎం పై మండిపడ్డారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యం మంటగలిసిందని, మానవ హక్కులు మృగ్యమైపోయాయని నారాయణ మండిపడ్డారు. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం, ట్రేడ్‌ యూనియన్‌ చట్టానికి లోబడి ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను అణిచివేయడానికి సీఎం కేసీఆర్‌ కుట్ర పన్నారని ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకొని ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలన్నారు. 

శుక్రవారం ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వచ్చి, తెలంగాణలో కార్మిక సంఘాల అణిచివేతపై ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ సమ్మెను పరిష్కరించేందుకు హక్కుల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. కేసీఆర్‌ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కార్మికులది సెల్ఫ్‌ డిస్మిస్‌ కాదని, కేసీఆరే రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సకల జనుల సమ్మె తరహాలో ఆర్టీసీ సమ్మెకు అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తోందన్నారు. 

టీఎన్జీవోలను కూడాప్రలోభ పెట్టాలని కేసీఆర్‌ ప్రయత్నించినా వారంతా ఆర్టీసీ కార్మికులకే మద్దతు ప్రకటించారని చెప్పారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసిన 1200 మంది విద్యార్థుల శవాలపై నడుచుకుంటూ పోయి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి బీజేపీయే కారణమన్నారు. 

ఆర్నెల్ల ముందే ఎన్నికలకు అనుమతించాలని చెప్పడం ద్వారా కేసీఆర్‌ బీజేపీ నేతలను బోల్తా పడేశారని చెప్పారు. అసెంబ్లీకి, లోక్‌సభకు ఎన్నికలు ఒకేసారి జరిగితే కేసీఆర్‌ మరోసారి సీఎం అయి ఉండేవారు కాదన్నారు. తెలంగాణ బంద్‌కు మద్ధతుగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ను ముట్టడించాలని ఏఐటీయుసీ, సీపీఐ పిలుపునిచ్చాయని నారాయణ తెలిపారు.