బీజేపీపై మండిపడ్డారు సీపీఐ జాతీయ నేత నారాయణ. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ వాళ్లు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. బ్రిటీష్ సామ్రాజ్యవాద నాయకుల బూట్లు నాకిన ఆర్ఎస్ఎస్ వాళ్లు ఇవాళ మాట్లాడుతున్నారా అంటూ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ వాళ్లు ఎక్కడున్నారని ప్రశ్నించారు సీపీఐ జాతీయ నేత నారాయణ. ఒక్కరి పేరైనా చెప్పగలరా అని ఆయన నిలదీశారు. సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిని కలిసే ధైర్యం వుందా అంటూ నారాయణ ప్రశ్నించారు. బ్రిటీష్ సామ్రాజ్యవాద నాయకుల బూట్లు నాకిన ఆర్ఎస్ఎస్ వాళ్లు ఇవాళ మాట్లాడుతున్నారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులను, పోరాటాలను బీజేపీ వాళ్లు అద్దెకు తెచ్చుకుంటున్నారంటూ నారాయణ సెటైర్లు వేశారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే బతుకు బీజేపీదంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో, మునుగోడులో పాగా వేయడానికి తెలంగాణ సాయుధ పోరాటాన్ని వాడుకుంటున్నారంటూ నారాయణ దుయ్యబట్టారు. వల్లభభాయ్ పటేల్, చాకలి ఐలమ్మ, అల్లూరి సీతారామరాజులను హైజాక్ చేసినట్లే తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా హైజాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీపీఐ నారాయణ ఆరోపించారు. 

అంతకుముందు కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా.. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండ్, కర్ణాటక రవాణాశాఖ మంత్రి బి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. హైదరాబాద్ స్వాతంత్య్రం కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. జలియన్‌వాలాబాగ్ తరహా ఘటన గుండ్రాంపల్లిలో జరిగిందని అన్నారు. సర్దార్ పటేల్ చొరవతో పోలీసు చర్య తీసుకోవడం వల్లే తెలంగాణ విముక్తి సాధ్యమైందని అన్నారు. ఆనాడు 109 గంటల పాటు సైనిక చర్య అవిశ్రాంతంగా జరిగిందన్నారు. పటేల్ లేకుంటే తెలంగాణ విముక్తికి మరింత సమయం పట్టేదని అన్నారు.

ALso REad:స్వార్దం కోసం తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారు.. సమాజాన్ని చీల్చే ప్రయత్నం జరుగుతోంది: సీఎం కేసీఆర్

తెలంగాణకు, కర్ణాటక, మహరాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత హైదరాబాద్ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సాహసించలేదని అన్నారు. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతోనే ఇన్నాళ్లు వేడుకలను జరపలేదని విమర్శించారు. ప్రధాని మోదీ ఈ ఏడాది తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు. ఏ భయం లేకుండా వేడుకలను చేసుకోవాలని ప్రజలను కోరుతున్నట్టుగా చెప్పారు.