హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత గుండా మల్లేష్ మంగళవారం నాడు మరణించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంగా ఉన్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.

వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలతో ఆయన ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. ఆయనకు డయాబెటీస్ వ్యాధి కూడ ఉంది. ఇదే సమయంలో కిడ్నీ సంబంధమైన సమస్యలు ఏర్పడినట్టుగా వైద్యులు తెలిపారు. దీంతో ఆయన నిమ్స్ లో చికిత్స తీసుకొంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ మరణించారు.

1983, 1985, 1994  ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీపీఐ అభ్యర్ధిగా  ఆసిఫాబాద్ స్థానం నుండి అడుగుపెట్టారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి అసెంబ్లీ స్థానంనుండి ఆయన ప్రాతినిథ్యం వహించారు. 2014, 2018 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యాడు.

 2009 నుండి 2014 వరకు ఉమ్మడి ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో ఆయన సీపీఐ శాసనసభపక్షనాయకుడిగా పనిచేశారు.సీపీఐ కంట్రోల్ కమిషపన్ సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు.


అతి చిన్న కుటుంబం నుండి వచ్చిన మల్లేష్ ఎమ్మెల్యేగా ఎదిగాడు.  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తాండూరు మండలం రేచిని గ్రామంలో మల్లేష్ పుట్టాడు. అప్పట్లోనే ఆయన మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్ పోర్టులో క్లీనర్ గా డ్రైవర్ గా పనిచేశాడు. 

ఈ సమయంలోనే ఆయన క్లీనర్, డ్రైవర్ల సమస్యపై పోరాటం చేశాడు. దీంతో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆయన సింగరేణిలో కార్మికుడు చేరారు. ఈ సమయంలో ఆయన కార్మిక ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ఆయన సీపీఐలో చేరాడు. 

1970లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఆయన  సీపీఐలో పూర్తిస్తాయి కార్యకర్తగా చేరాడు. 1983లో ఆసిఫాబాద్ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఉమ్మడి ఏపీ  అసెంబ్లీలో అడుగుపెట్టారు.