35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ పోలీస్ పునర్ వ్యవస్థీకరణ జరిగిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. హైదరాబాద్ నగరంలో జూన్ 2వ తేదీ నుంచి కొత్త పోలీసు స్టేషన్ల అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.
హైదరాబాద్: 35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ పోలీస్ పునర్ వ్యవస్థీకరణ జరిగిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. హైదరాబాద్ నగరంలో జూన్ 2వ తేదీ నుంచి కొత్త పోలీసు స్టేషన్ల అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ జనాభా విపరీతంగా పెరుగిందని చెప్పారు. 35 ఏళ్ల కింద కమిషనరేట్ పరిధిలో 25 లక్షల జనాభా ఉండేదని.. ఇప్పుడు జనాభా 85 లక్షలకు పెరిగిందన్నారు. వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగిందని చెప్పారు. హైదరాబాద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగు చేయడంతో పాటు శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు.
ఈ క్రమంలోనే 6 నెలల పాటు వర్క్ చేసిన తర్వాత రీ ఆర్గనైజేషన్ కమిటీ.. పోలీస్‌స్టేషన్ల పెంపుదల, జోన్ల రూపుపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 కొత్త డీసీపీ జోన్లు, 11 ఏసీపీ డివిజన్లు, 11 కొత్త లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌లు, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లు, 5 కొత్త ఉమెన్ పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు.
సెక్రటేరియట్ కోసం కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సెక్రటేరియట్ పోలీసు స్టేషన్‌ను బీఆర్‌కే భవన్‌లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సెక్రటేరియట్ పోలీసు స్టేషన్‌కు స్పెషల్‌గా ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు విధుల్లో ఉంటారని తెలిపారు. ఇక, సైబర్ క్రైమ్ కోసం ఒక డీసీపీతో పాటు మొత్తం 148 మంది పోలీస్ అధికారులను కేటాయించినట్లు చెప్పారు. జూన్ 2 నుంచి కొత్త పోలీస్ స్టేషన్స్‌లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తామన్నారు.
