కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఆర్ధిక రంగంపై ప్రభావం చూపుతోంది. దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక  లాంటి బ్యాంకింగ్‌ విషయానికి వస్తే.. ఇప్పటికే ఎంతోమంది బ్యాంక్ సిబ్బంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. ఈ క్రమంలో 600 మంది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఉద్యోగులకు పాజిటివ్‌గా తేలింది.  దీంతో ఎస్‌బీఐ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రేపటి నుంచి ఈ నెల 30 వరకు తమ బ్రాంచీల్లో సగం మంది ఉద్యోగులతో విధులు నిర్వహించనున్నట్లు ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌బీఐకి చెందిన బ్రాంచీల్లో తొలి దశలో 2000 మందికి పైగా ఉద్యోగులు కరోనా బారినపడ్డారని... రెండో దశలో ఇప్పటివరకు 600 మందికి వైరస్‌ సోకిందని మేనేజర్ చెప్పారు. ఖాతాదారులతో ప్రత్యక్ష సంబంధాలున్న ఉద్యోగులు, లోన్‌ ప్రాసెసింగ్‌ విభాగం సిబ్బంది కొవిడ్‌ బారినపడ్డారు.

Also Read:తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్: ఒక్క రోజులోనే 20 మంది మృతి, 6 వేలు దాటిన కేసులు

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో డిజిటల్‌ సేవలకు ప్రాధాన్యమివ్వాలని ఆయన ఖాతాదారులను కోరారు. అత్యవసరమైతేనే ప్రజలు బ్యాంకులకు రావాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ ఉష్ణోగ్రత కలిగి మాస్క్‌లు ధరించిన వారినే లోపలికి అనుమతిస్తామని మేనేజర్ స్పష్టం చేశారు.   

మరోవైపు హైదరాబాద్‌ సర్కిల్‌లోని కస్టమర్లకు కరోనా సెకండ్ వేవ్ వల్ల ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తాత్కాలికంగా హెల్ప్‌లైన్‌ నంబరు 040-23466233ను ఏర్పాటు చేసింది స్టేట్  బ్యాంక్.

బ్యాంకు పనివేళల్లో ఈ నంబరు పనిచేస్తుందని అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్‌ కోఠి, సికింద్రాబాద్‌ ఎస్‌బీఐ కార్యాలయాల్లో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.