వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం సంగెం గ్రామంలో కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని జేసీబీలో తరలించి ఆదివారం నాడు అంత్యక్రియలు నిర్వహించారు.

వలిగొండ మండలంలోని సంగెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది.కరోనాతో ఆ వ్యక్తి మూడు రోజుల క్రితం మరణించారు. కరోనాతో మరణించడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు, గ్రామస్తులు ఎవరూ కూడ ముందుకు రాలేదు. దీంతో మూడు రోజులుగా డెడ్ బాడీ ఇంట్లోనే ఉంది.

ఈ విషయమై మృతుడి కుటుంబసభ్యులు వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పీపీఈ కిట్స్ లేని కారణంగా తాము కూడ ఏమీ చేయలేమని వారు తేల్చి చెప్పారు. చివరికి వైద్య సిబ్బంది కుటుంబసభ్యులకు నాలుగు పీపీఈ కిట్స్ ను అందించారు.

దీంతో డెడ్ బాడీని పీపీఈ కిట్స్ ధరించిన కుటుంబసభ్యులు జేసీబీలో చేర్చారు. జేసీబీలోనే డెడ్ బాడీని స్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.గతంలో కూడ ఇదే తరహాలో తెలుగు రాష్ట్రాల్లో జేసీబీ ద్వారా కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీ రాాష్ట్రంలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడంతో ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది.