సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రి మార్చురీ నుంచి కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహం అదృశ్యమైంది. కోవిడ్ 19తో రషీద్ అలీ అనే వ్యక్తి మరణించడంతో అతని మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆయన కుటుంబసభ్యులు ఆసుపత్రికి వచ్చారు.

అయితే డెడీ బాడీ కనిపించకపోవడంతో ఆసుపత్రి వర్గాలకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో ఉదయం నుంచి అలీ మృతదేహం కోసం అణువణువు గాలించారు. చివరికి రషీద్ అలీ మృతదేహాన్ని వేరొకరికి అప్పగించినట్లు గుర్తించారు.

ఎట్టకేలకు రషీద్ మృతదేహాన్ని సంపాదించి కుటుంబసభ్యులకు అప్పగించడంతో ఆసుపత్రి వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. రషీద్ డెడ్‌బాడీ కోసం సుమారు 12 గంటలుగా ఆయన కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. చివరికి మృతదేహం దొరకడంతో ఆందోళన విరమించి అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు. 

కాగా కరోనాతో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మంగళవారం రాత్రి చనిపోవడంతో ఆయన బంధువులు పీజీ వైద్యులపై దాడి చేయడంతో గాంధీ ఆసుపత్రి రణరంగంగా మారిన సంగతి తెలిసిందే.

ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు చికిత్స అందిస్తుంటే తమపై దాడులు చేయడంపై జూడులు భగ్గుమన్నారు. అన్ని వార్డుల వద్ద ఎస్పీజీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతూ ధర్నా చేశారు.