రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం పోత్గల్‌లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన షేక్ మదార్ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతను ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు.

మదార్‌‌ను పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్ వచ్చిందని, అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వెంటనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని కుటుంబసభ్యులకు సూచించారు.

దీంతో అంబులెన్స్ సాయంతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మదార్ మరణించాడు. మృతదేహాన్ని కోవిడ్ ఆంబులెన్స్ సిబ్బంది సిరిసిల్ల ఏరియా అసుపత్రి ఆవరణలో వదిలేసి వెళ్లిపోయారు.

కొద్దిగంటల నుంచి మృతదేహం అక్కడే వున్నప్పటికీ ఆసుపత్రి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కనీసం మృతదేహాన్ని మార్చురీలో కూడా ఉంచకుండా ఆరుబయటనే వదిలి వెళ్ళిపోయారని మృతుడి బంధువు ఆవేదన వ్యక్తం చేశాడు. మదార్ కోవిడ్‌తో చనిపోయినట్లు తెలుసుకున్న తోటి రోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.