తెలంగాణలో కోవాగ్జిన్‌ రెండో డోసును నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కేంద్రం నుంచి కోవాగ్జిన్ స్టాక్ రాలేదని తెలంగాణ సర్కార్ వెల్లడించింది. మళ్లీ ఎప్పుడు వ్యాక్సినేషన్ మొదలయ్యేది త్వరలోనే ప్రకటిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

కాగా, రాష్ట్రంలో ఇంకా 15 లక్షల మందికి మే 31లోపు వారికి రెండో డోస్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్నారు డీహెచ్ శ్రీనివాసరావు. కోవిషీల్డ్ రెండో డోసును ఆరు నుంచి ఎనిమిది వారాల మధ్యలో తీసుకోవాలని.. కోవాగ్జిన్‌ టీకాను నాలుగు నుంచి ఆరు వారాల మధ్యలో తీసుకోవాలని సూచించారు.

Also Read:తెలంగాణకు ఊరట.. స్వల్పంగా తగ్గిన కేసులు, జీహెచ్ఎంసీలో తీవ్రత

రాష్ట్రంలో మిగతా వారికి దశల వారీగా టీకాను అందిస్తామని స్పష్టం చేశారు డీహెచ్‌ శ్రీనివాస్‌. ఆరోగ్య సేవల విషయంలో లాక్‌డౌన్‌ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని.. కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ల కోసం బయటకు వచ్చే వారికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉందన్నారు శ్రీనివాస్‌.

తగిన పత్రాలు చూపి పోలీసుల అనుమతి పొందవచ్చని చెప్పారు. ఇక లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసరం అయితే తప్ప.. ప్రజలెవరూ బయటకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ మినహాయింపు సమయంలో ప్రజలందరూ అత్యంత జాగ్రత్తతో ఉండాలన్నారు.

ప్రభుత్వం అనుమతించిన 4 గంటల్లోనే బయటకు రావాలని శ్రీనివాస్ సూచించారు. వైన్స్‌, సూపర్‌ మార్కెట్ల వద్ద ప్రజలు భారీగా గుమిగూడుతున్నారని.. అలాంటి ప్రాంతాలు కోవిడ్ కేంద్రాలుగా మారే ప్రమాదం ఉందని డీహెచ్ హెచ్చరించారు‌.