Asianet News TeluguAsianet News Telugu

కోమటిరెడ్డి, సంపత్ కేసులో నెలరోజుల ఉత్కంఠ

ఆఖరికి ఏమైతదబ్బా ?

Court reserves judgement in KomatiReddy and Sampath case

అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వ రద్దు అంశం అనేక మలుపులు తిరుగుతున్నది. కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వ రద్దును హైకోర్టు కొట్టేసింది. దీంతో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ్యత్వ రద్దుపై సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో అప్పీల్ పిటిషన్ మీద వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వులో ఉంచినట్లు ప్రకటించింది హైకోర్టు. వేసవి సెలవుల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువరిస్తామని న్యాయస్థానం తెలిపింది.

ఈ కేసు విషయంలో హైకోర్టులో వాదనలు జరిగిన తీరు చూస్తే తీర్పు ఎలా వస్తుందా అన్న ఉత్కంఠ ఇటు అధికార టిఆర్ఎస్ పార్టీలో కానీ.. అటు ప్రతిపక్ష కాంగ్రెస్ వర్గాల్లో కానీ నెలకొందని చెప్పొచ్చు. ఈ కేసులో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు సరికాదని కాంగ్రెస్ సభ్యుల తరుపు లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఎమ్మెల్యేలు నేరుగా హైకోర్టుకు రావడం సరికాదన్నారు. వాళ్లకు ఏదైనా ఇబ్బంది కలిగితే ముందు స్పీకర్ కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు. అలాంటిదేమీ లేకుండా సహచర సభ్యుల సభ్యత్వ రద్దు విషయంలో వారు హైకోర్టులో కేసు వేయడాన్ని ప్రశ్నించారు.

మరోవైపు ఈ కేసులో టిఆర్ఎస్ సభ్యుల తరుపున వైద్యనాథన్ వాదనలు వినిపించారు. సభలో కోమటిరెడ్డి, సంపత్ తీరు సరిగాలేదని, ఈ విషయంలో యావత్ అసెంబ్లీ చర్యలు తీసుకుందని వాదించారు.

ఇక ఇరు వర్గాల వాదనలు పూర్తి కావడంతో వేసవి సెలవులు ముగిసిన తర్వాత తీర్పు వెలువడనుంది. జూన్ మొదటి వారంలో ఈ కేసులో తీర్పు రానుంది. అయితే ఈ తీర్పుపై ఎవరికి వారు తమకు అనుకూలంగానే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఈ కేసులో మరోసారి టిఆర్ఎస్ పార్టీకి మొట్టికాయలు తప్పవని, బేస్ లేకుండానే, సభ్యత్వ రద్దు చేశారని, ఇప్పుడు కేసు కూడా అంతేనని కోమటిరెడ్డి చెబుతున్నారు. తన సర్టిఫికెట్ల విషయంలో మూడేళ్లపాటు కేసు నడిపిని ఇద్దరు టిఆర్ఎస్ లీడర్లు దుబ్బాక నర్సింహ్మారెడ్డి, కంచర్ల భాపాల్ రెడ్డికి హైకోర్టు మొట్టికాయలు వేయడమే కాదు ఏకంగా వారికి 25వేల జరిమానా విధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

మొత్తానికి కోమటరెడ్డి, సంపత్ కేసు తేలాలంటే మరో నెలరోజులు ఆగాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios