తెలంగాణలో సంచలనం సృష్టించింది నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య ఘటన. ఆ ఘటన అనూహ్యమలుపులు తిరుగుతున్నది. తాజాగా బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

బొడ్డుపల్లి హత్య కేసులో నిందితుల బెయిల్ ను నల్లగొండ జిల్లా అడిషనల్ కోర్టు రద్దు చేసింది. ఈ విషయంలో బుధవారం నాడు కోర్టు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎ6 నుంచి ఎ 10 వరకు నిందితుల బెయిల్ ను కోర్టు రద్దు చేసింది. నిందితులు వారం రోజుల్లోగా పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది. బొడ్డుపల్లి కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడం వల్ల విచారణకు ఆటంకం కలుగుతుందని నల్లగొండ టూటౌన్ పోలీసులు గత నెలలో జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఎ 6 నుంచి ఎ 10 వరకు నిందితులందరికీ బెయిల్ ను రద్దు చేయాలని కోరారు. పోలీసుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న జిల్లా అడిషనల్ కోర్టు నిందితుల బెయిల్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

ఈ కేసులో 11 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. అయితే ఎ 11 కు ఈ కేసులో పెద్దగా పాత్ర లేదని అతడి బెయిల్ రద్దు కోరలేదు. కేవలం హైదరాబాద్ లో నిందితులకు షెల్టర్ ఇచ్చిన కారణంగా ఎ 11 ను కేసులో ఉంచారు.

రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో నల్లగొండ పోలీసులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. నిందితులకు పోలీసులు సపోర్ట్ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. హత్య జరిగి వారం రోజులు కాకముందే నిందితులకు బెయిల్ రావడం పట్ల పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున అనుమానాలు కలిగాయి. ఈ కేసులో నల్లగొండ టూటౌన్ సిఐ ఏకంగా చెప్పా పెట్టకుండా గుంటూరు వెళ్లిపోయి అందరికీ షాక్ ఇచ్చారు.

ఎట్టకేలకు బెయిల్ రద్దు తీర్పు రావడంతో కొంతలో కొంత నల్లగొండ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

మరి విచారణ ఏమేరకు చేసి నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా కసరత్తు చేస్తారో చూడాలి.