నల్లగొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని నల్లగొండ ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసును మూడు వారాలకు వాయిదా వేసింది.

నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. రాజకీయ కుట్రతోనే ఈ హత్య జరిగిందని లక్ష్మి మొదటినుంచీ ఆరోపిస్తూ వస్తున్నారు. పార్టీ మారాలంటూ వత్తిడి చేశారని, బెదిరించారని ఆమె చెబుతున్నారు. ఆమె నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మీద ఆరోపణలు చేశారు. ఆమెతోపాటు నల్లగొండ స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నకిరేకల్ ఎమ్మెల్యే మీద ఆరోపణలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో ఈ హత్యపై నల్లగొండ పోలీసులు సమగ్ర విచారణ జరపలేదని, నిందితులతో పోలీసులు కుమ్మక్కయ్యారని బొడ్డుపల్లి లక్ష్మి ఆరోపించారు. దీనిపై హైకోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్త హత్య మీద సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే సిట్ విచారణ అయినా జరిపి వాస్తవాలు తెలియజేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె కేసును హైకోర్టు స్వీకరించింది.

అయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ ఈ హత్యపై స్పష్టమైన ప్రకటన చేశారు. బజ్జీల బండి దగ్గర పంచాయితీ కారణంగానే హత్య జరిగిందని, రాజకీయ కుట్ర లేదని ఎస్పీ వివరణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఇప్పటికే మీడియాకు విడుదల చేసిన నివేదికను హైకోర్టుకు నివేదించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదికతో హైకోర్టు సంతృప్తి చెందితే..సరే లేదంటే కేసును దర్యాప్తు సంస్థకు అప్పగించే అవకాశం ఉంటుంది. మూడు వారాల్లో ఈ కేసుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మొత్తానికి లక్ష్మి హైకోర్టులో కేసు వేయడంతో కేసును హైకోర్టు స్వీకరించడం పట్ల కాంగ్రెస్ వర్గాల ఆరోపణలకు బలం చేకూరిందని వారు చెబుతున్నారు.