నిజామాబాద్ లో కరోనా కల్లోలం... గంట వ్యవధిలోనే దంపతుల మృతి
ఇటీవలే జగిత్యాల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని కరోనా వైరస్ బలితీసుకున్న ఘటనను మరువక ముందే నిజామాబాద్ జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది.
నిజామాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులే కాదు ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవలే జగిత్యాల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని ఈ వైరస్ బలితీసుకున్న ఘటనను మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది. కేవలం గంట వ్యవధిలోనే భార్యాభర్తలు కరోనాతో మరణించిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆర్మూర్ ఎంఐఎం నేత గోరేమియా ఇటీవల కరోనా బారినపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు కూడా టెస్ట్ చేయించుకోగా ఆయన భార్యకు కూడా పాజిటివ్ గా తేలింది. దీంతో దంపతులిద్దరూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు. ఈ క్రమంలో ఇవాళ(బుధవారం)ఉదయం గోరేమియా ఆరోగ్యపరిస్థితి మరింత క్షీణించి ప్రాణాలు కోల్పోయాడు.
దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయన మృతదేహాన్ని ఆర్మూరుకు తరలించి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా మరో విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య ఆరోగ్యం కూడా క్షీణించి చనిపోయారు. ఇలా కేవలం గంట వ్యవధిలోనే భార్యాభర్తలను కరోనా బలితీసుకుంది. ఇలా ఒకేసారి దంపతులిద్దరు మృతిచెందడంతో ఆ కుటంబంలో విషాదం నెలకొంది.
read more కరోనాతో కల్లోలం: జగిత్యాలలో రోజుల వ్యవధిలో తండ్రీ కొడుకు మృతి
ఇదిలావుంటే తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 6,542 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 3,67,901కి చేరుకొంది.
గత 24గంటల్లో కరోనా నుండి 2,887 మంది కోలుకోగా 20 మంది మరణించినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 46,488 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1,30,105 మందికి పరీక్షలు నిర్వహించినట్టుగా వైద్య శాఖ తెలిపింది. ఇంకా 6,242 మంది పరీక్షల రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది.
గత 24 గంటల వ్యవధిలో ఆదిలాబాద్ లో 98, భద్రాద్రి కొత్తగూడెంలో 128, జీహెచ్ఎంసీ పరిధిలో 898 జగిత్యాలలో230,జనగామలో 84, జయశంకర్ భూపాలపల్లిలో32, గద్వాలలో48, కామారెడ్డిలో 235, కరీంనగర్ లో 203,ఖమ్మంలో 246, మహబూబ్‌నగర్లో 263, ఆసిఫాబాద్ లో 37, మహబూబాబాద్ లో64, మంచిర్యాలలో 176,మెదక్ లో181 కేసులు నమోదయ్యాయి.
మల్కాజిగిరిలో570, ములుగులో42, నాగర్ కర్నూల్ లో 131, నల్గగొండలో285, నారాయణపేటలో37, నిర్మల్ లో 143, నిజామాబాద్ లో427, పెద్దపల్లిలో96, సిరిసిల్లలో124, రంగారెడ్డిలో532, సిద్దిపేటలో 147, సంగారెడ్డిలో320, సూర్యాపేటలో130, వికారాబాద్ లో 135, వనపర్తిలో81, వరంగల్ రూరల్ లో 85, వరంగల్ అర్బన్ 244, యాదాద్రి భువనగిరిలో 140 కేసులు నమోదద్యాయి.