దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఒక వ్యక్తిని దారుణంగా చంపి మృతదేహాన్ని డ్రైనేజీలో పడేశారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఒక వ్యక్తిని దారుణంగా చంపి మృతదేహాన్ని డ్రైనేజీలో పడేశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వివరాలు.. ఉత్తమ్ నగర్‌లోని శివ్ విహార్ వద్ద డంప్‌యార్డ్ ఎదురుగా ఉన్న నజాఫ్‌గఢ్ డ్రెయిన్‌లో పెద్ద బ్యాగ్ పడేసినట్లు పోలీసులుకు సమాచారం అందింది. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగ్‌లో 20 ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు.
అయితే ఆ బ్యాగ్‌ను ఈ కామర్స్ కంపెనీలు వస్తువులను పంపిణీ చేసేందుకు ఉపయోగించేదిగా గుర్తించారు. అయితే హత్యకు గురైన వ్యక్తిని వికాస్ నగర్‌లో నివాసముంటున్న ఉమేష్‌గా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు.. ఉమేష్ ఆదివారం సాయంత్రం తనకు పరిచయస్తుడైన సన్నీ గదికి వెళ్లాడని పోలీసులు కనుగొన్నారు. అక్కడే ఉన్న ఇతరులతో కలిసి ఉమేష్ కొన్ని మత్తు పదార్థాలు తీసుకుంటాడనే అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే వారి మధ్య గొడవ జరిగి ఉమేష్ హత్యకు గురయ్యాడని పోలీసులు గుర్తించారు. ఉమేష్‌ను హత్య చేసిన తర్వాత, నిందితులు అతని మృతదేహాన్ని పెద్ద బ్యాగ్‌లో నింపి సోమవారం డ్రెయిన్‌లో పడవేసినట్లుగా తెలిపారు.
ఈ క్రమంలోనే పోలీసులు నిందితులను సుభమ్, అతని భార్య ఫాతమాగా గుర్తించారు. వారిద్దరినీ ప్రస్తుతం అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే వారికి సహకరించిన సన్నీ పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
