Hyderabad: తెలంగాణ ప్రభుత్వానికి అవినీతి గుర్తింపుగా మారిందని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఆరోపించారు. నేడు తెలంగాణలో అన్ని రంగాల్లో కుంభకోణాలు జరుగుతున్నాయని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 

BJP national President J.P. Nadda: బీజేపీ-బీఆర్ఎస్ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ ప్రభుత్వానికి అవినీతి గుర్తింపుగా మారిందని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఆరోపించారు. నేడు తెలంగాణలో అన్ని రంగాల్లో కుంభకోణాలు జరుగుతున్నాయని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భ్రష్టచార్ రిష్వత్ సర్కార్ గా అభివర్ణించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోని స‌ర్కారుకు అధికారంలో కొనసాగే హక్కు లేదని పేర్కొన్నారు. నేడు అవినీతి తెలంగాణ ప్రభుత్వ గుర్తింపుగా మారిందని విమ‌ర్శించారు. "అవినీతి ఈ ప్రభుత్వానికి గుర్తింపుగా మారింది. ఈ బీఆర్ఎస్ పార్టీ భ్రష్టచార్ రిష్వత్ సర్కార్ గా మారింది" అని జేపీ న‌డ్డా అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల‌లో కొత్త బీజేపీ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయ‌న పై వ్యాఖ్య‌లు చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉండేదనీ, కానీ నేడు రాష్ట్రం రూ.3.29 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని బీఆర్ఎస్ స‌ర్కారు తీరుపై మండిప‌డ్డారు. 

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా అవతరించినప్పుడు చేసిన వ్యాఖ్యలను ఎత్తిచూపుతూ.. పేరు మారింది కానీ, దాని తీరు మారలేదని అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 'ఇది దురదృష్టకర పరిస్థితి. తెలంగాణ ఇమేజ్ అవినీతి రాష్ట్రంగా మారింది' అని పేర్కొన్నారు. కేవలం పేరు మార్చడం వల్ల ప్రయోజనం ఉండదనీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఒకటేనని తెలంగాణ ప్రజలకు తెలుసని నడ్డా అన్నారు. తెలంగాణ ప్రజలు మీకు ఓ సందేశం పంప‌డానికి సిద్ధ‌మ‌య్యార‌నీ, అది మీకు వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్) అని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని రంగాల్లో కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వానికి ఏటీఎంలా మారిందనీ, ప్రాజెక్టు వ్యయాన్ని రూ.40 వేల కోట్ల నుంచి రూ.1.40 లక్షల కోట్లకు పెంచారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ కు మోడీ ప్రభుత్వం తన వంతు సాయం చేస్తోందని పేర్కొన్న ఆయ‌న‌.. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నడ్డా అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి, స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని అందించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు బీజేపీకి మద్దతివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని ఆయన అన్నారు. ఓబీసీల గురించి అవమానకరమైన పదాలను ఉపయోగించినందుకు క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఈ పార్టీ పరువు పోయింది. కాంగ్రెస్ ఈ స్థాయికి దిగజారినప్పటికీ ఆ పార్టీ నాయకులు ఇంకా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. వారు దేశాన్ని అవమానిస్తారు, ఓబీసీ కమ్యూనిటీ గురించి సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేస్తారు. ఇదంతా దురదృష్టకరం" అని పేర్కొన్నారు.