కరోనా మహమ్మారి మనుషుల మధ్య మానవత్వాన్ని చంపేస్తుంది. ఇలాంటి సంఘటనలు మనం ఈ మధ్య తరచుగా చూస్తూనే ఉన్నాము. మానవ సంబంధాలనేవే ప్రశ్నార్థకంగా మారిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఒక సంఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పాల్వంచలో చోటు చేసుకుంది. 

గుండెపోటుతో ఒక వ్యక్తి మరణిస్తే అతడు కరోనా సోకి మరణించాడన్న అనుమానంతో... ఊరిలో వారెవరు అంత్యక్రియలకు సహకరించలేదు. దాదాపుగా ఆ వ్యక్తి మరణించిన 22 గంటలపాటు శవాన్ని ఇంట్లోనే ఉంచుకొని ఆ కుటుంబ సభ్యులు గ్రామస్థుల కాల్వెల్లఁ సహకరించమని కోరినా వారు కనికరించలేదు. 

చివరకు గ్రామానికి చెందిన రంజిత్ అనే ఒక వ్యక్తి శవాన్ని తరలించడానికి ట్రాక్టర్ ఇచ్చాడు. అప్పుడు కూడా ఆ శవాన్ని తరలించడానికి గ్రామంలోని ఎవరు ముందుకు రాకపోవడంతో.... మునిసిపల్ సిబ్బందిని పిలిపించవలిసి వచ్చింది. వారితో కలిసి స్మశానంలో ఖననం చేసారు. 

శవాన్ని ట్రక్టర్ లో తరలిస్తుండగా కూడా... గ్రామస్థులు తమ సందుల్లోకి ఆ శవాన్ని తీసుకురావద్దంటూ గొడవ చేసారు కూడా. పాల్వంచ మండలం నగరం గ్రామంలో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. తమ కుటుంబ పెద్ద గౌరవ ప్రదమైన అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోలేదని వారి కుటుంబ సభ్యులు వాపోయారు.