తెలంగాణాలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని కట్టడి చర్యలకు పూనుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలపై కూడా కరోనా ప్రభావం పడనుంది. బోనాలపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలను విధించేందుకు యోచిస్తున్నట్టు తెలియవస్తుంది. ఈ నెల 25 నుండి ఆషాఢ మాస బోనాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో ఈ నెల 10వతేదీన మంత్రులు సమావేశమై దీనిపై ఒక అంతిమ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

ప్రతి పర్యాయం జరిగే విధంగా కాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తుల్ని అమ్మవారి ఆలయాలకు అనుమతించాలని అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్టు తెలియవస్తుంది. 10వ తేదీన మంత్రులు, దేవాదాయ శాఖ అధికారులు సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్న అనంతరం బోనాల జాతర నిర్వహణపై మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండగగా ప్రకటించింది. ప్రతి ఏడాది బోనాల జాతర నిర్వహణకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తోంది. ఈ సారి కరోనా కారణంగా నిధులు విడుదల చేయలేదు. 

ఈసారి బోనాల్లో ఘటాల ఊరేగింపు, పోతరాజుల నృత్యాలు, కళాకారుల ఆటపాటలు లేకుండానే సాదాసీదాగా ఆషాఢ బోనాల జాతర నిర్వహించాలని అధికారులు మార్గదర్శకాలను జారీచేసే యోచనలో ఉన్నట్టు తెలియవస్తుంది. 

హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలతో షురూ అయ్యే బోనాలు ఈనెల 25న ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలో ముందుగా బోనాల ఉత్సవాలు ఇక్కడ ప్రారంభమవడమే కాకుండా ఇక్కడే ముగియడం విశేషం.  ఈ సారి గోల్కొండ కోటలో వంటా వార్పులకు అనుమతి ఇవ్వొద్దని అధికారులు భావిస్తున్నట్లు గా సమాచారం. 

ఇకపోతే... తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 206 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇంత పెద్ద సంఖ్యలో ఎప్పుడూ కూడ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,496కి చేరుకొన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 206 కేసులు నమోదు కావడం రికార్డు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 152 కేసులు నమోదయ్యాయి.