కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు దేశమంతా లాక్ డౌన్ బాట పట్టింది. తెలంగాణాలో కూడా నెలన్నరుకు పైగా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేసింది. మరికొంతకాలం గనుక ఈ లాక్ డౌన్ ను పొడిగిస్తే... కరోనా వైరస్ కన్నా ఆకలి, ఉపాధి కోల్పోవడం వంటి సమస్యలతో ప్రజలు ఎక్కువగా ఇబ్బందులుపడుతారు అని గ్రహించిన ప్రభుత్వం లాక్ డౌన్ నియమాలను సడలించింది. 

లాక్ డౌన్ నియమాలను సడలించడంతో ప్రజలంతా ఏదో కరోనా వైరస్ పూర్తిగా మాయమైపోయినట్టుగా బయట సంచరిస్తున్నారు. గుంపులు గుంపులుగా బయటకు వస్తూ పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. 

లాక్ డౌన్ సడలింపులు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం అవసరముంటేనే బయటకు రమ్మని చెప్పినప్పటికీ.... ప్రజలు మాత్రం అవసరం ఉన్నా లేకపోయినా బయటకు వస్తున్నారు. 

ఇంతకుముందు హైదరాబాద్ లో కేసులన్నీ దాదాపుగా పాతబస్తీ ప్రాంతంలోనే నమోదయ్యాయి. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి దాదాపుగా అదుపులోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా శివారు ప్రాంతాలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఇది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. 

తెలంగాణాలో నమోదవుతున్న కేసుల్లో అన్ని కేసులు కూడా జంటనగరాల పరిధిలోనే నమోదవుతున్నాయి. మిగిలిన జిల్లాల నుంచి కేసులు నమోదు అవడం లేదు. ఇలా కొత్తగా శివారు ప్రాంతాల్లో నమోదవుతున్న కేసుల్లో వారికి ఎటువంటి కాంటాక్ట్ కానీ, ట్రావెల్ హిస్టరీ కానీ ఉండడం లేదు. బయట వస్తువులు కొనడానికో, వైన్ షాపులకు వెళ్ళినప్పుడు అంటించుకుంటున్నవారే ఎక్కువమంది ఉంటున్నారు. 

తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం వరకు 1761 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌వాసులే 1188 మంది ఉన్నారు. ఇప్పటి వరకు మృతి చెందిన 48 మందిలో, జంటనగరాలకు చెందినవారు 42 మంది ఉన్నారు.  

జిహెచ్ఎంసీ పరిధిలో రోజుకి సగటున 30 నుంచి 40 పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 696 యాక్టీవ్ కేసులు ట్రెలంగాణలో ఉన్నాయి. వీరిలో 70 మందికిపైగా పిల్లలు కూడా ఉన్నారు. 

శనివారం ఒక్కరోజే కింగ్‌ కోఠి ఆస్పత్రి ఓపీకి 87 మంది రాగా, వీరిలో దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్న 16 మందిని ఇన్‌పేషెంట్లుగా అడ్మిట్‌ చేసుకున్నాయి ఆసుపత్రి వర్గాలు. వీరితో పాటు ఐసొలేషన్‌ వార్డులో మరో ఇద్దరు కూడా ఉన్నారు. ఈ మొత్తం 18 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. 

ఇక ఫీవర్‌ ఆస్పత్రిలో 24 మంది అనుమానితులు ఉన్నారు. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రికి 21 మంది రాగా, వీరిలో 19 మందిని ఇన్‌పేషంట్లుగా అడ్మిట్‌ అయ్యారు. అందులో ముగ్గరికి పాజిటివ్‌ అని తేలగా, వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆయుర్వేద ఆస్పత్రికి నిన్న 10 మంది రాగా, వారి నుంచి నమూనాలు సేకరించి టెస్టులకు పంపారు.