భద్రాద్రి: కరోనా వైరస్ విషయంలో నిబంధనలు పాటించని కొత్తగూడెం డిఎస్పీపై కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన కుమారుడు లండన్ నుంచి తిరిగి వచ్చాడు. అతన్ని క్వారంటైన్ చేయకుండా, డీఎస్పీ బయటకు పంపించాడు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. 

తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు 33కు పెరిగాయి. వీటిలో మూడు కాంటాక్ట్ కేసులు ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అంతేకాకుండా నిబంధనలను ఉల్లంఘించినవారిపై తీవ్రమైన చర్యలకు కూడా ఉపక్రమించింది. ఇందులో భాగంగానే భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం డిఎస్పీపై కేసు నమోదైంది.

కరీంనగర్ లో కరోనా రెండో దశకు చేరుకుంది. ఈ రోజు ఒక్క రోజే ఆరు కేసులు బయటపడ్డాయి. కరోనా వైరస్ తో ఒక్కరు కూడా తెలంగాణలో చనిపోలేదని ఈటెల రాజేందర్ చెప్పారు. ఒక్కరు కూడా వెంటిలేటర్ మీద లేరని ఆయన చెప్పారు. ఒకరిని డిశ్చార్జీ చేశామని, ఒకటి రెండు రోజుల్లో మరింత మందిని డిశ్చార్జీ చేస్తామని చెప్పారు. 

గాంధీ, కింగ్ కోఠీ, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలను నిలిపేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కరోనా చికిత్సకు మద్దతు ప్రకటించాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో సోమవారం ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు.నిరోధక చర్యలను ఫీవర్ ఆస్పత్రిలో ఎక్కువగా చేయాలని నిర్ణయించామని చెప్పారు. ముందు జాగ్రత్తలో భాగంగానే షట్ డౌన్ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.