తెలంగాణలో మరోసారి కరోనా టెస్టులకు బ్రేక్... కేవలం ఆ ల్యాబుల్లోనే
తెలంగాణలో కరోనా నిర్దారణ టెస్టులకు మరోసారి బ్రేక్ పడింది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా నిర్దారణ టెస్టులకు మరోసారి బ్రేక్ పడింది. నాలుగు రోజుల పాటు ప్రైవేట్ ల్యాబ్స్ లో టెస్టులను నిలిపివేయనున్నారు. అయితే ప్రభుత్వ ల్యాబుల్లో మాత్రం టెస్టుల ప్రక్రియ యధావిధిగా కొనసాగనుంది.
ఐసీఎమ్మార్ నిబంధనల ప్రకారం ల్యాబ్ లను తీర్చిదిద్దడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసమే టెస్టులను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ల్యాబ్‌ల శానిటైజేషన్‌తో పాటూ, సిబ్బందికి శాంపిల్స్ సేకరణ, కరోనా టెస్టింగ్‌లపై ట్రైనింగ్ అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసమే నాలుగురోజుల పాటు ల్యాబ్స్ ను మూసివేయనున్నట్లు తెలుస్తోంది.
read more కరోనా హెల్త్ బులిటెన్‌లో అరకొర సమాచారం: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
మరోవైపు తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,018 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో కేసుల సంఖ్య 17,357కి చేరింది.
బుధవారం ఒక్కరోజే కరోనాతో ఏడుగురు మరణించడంతో.. మృతుల సంఖ్య 267కి చేరుకుంది. తెలంగాణలో ప్రస్తుతం 9,008 యాక్టివ్ కేసులు ఉండగా.. నిన్న 788 డిశ్చార్జ్ అవ్వడంతో కోలుకున్న వారి సంఖ్య 8,082కి చేరింది.
ఒక్క హైదరాబాద్‌లోనే 881 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత మేడ్చల్‌లో 36, రంగారెడ్డి 33, మహబూబ్‌నగర్ 10, వరంగల్ రూరల్, మంచిర్యాలలో తొమ్మిదేసి కేసులు, ఖమ్మం 7, జగిత్యాల, నల్గొండలో నాలుగేసి కేసులు, సిద్ధిపేట, నిజామాబాద్‌లో మూడేసి కేసులు, సంగారెడ్డి, కరీంనగర్, సూర్యాపేట, కామారెడ్డి, ములుగు, ఆసిఫాబాద్, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రిలలో రెండేసి చొప్పున, గద్వాలలో ఒక కేసు నమోదయ్యాయి.