నాగార్జున సాగర్ బీజేసీ నేతల్లో కరోనా టెన్షన్ కలకలం రేపుతోంది. సాగర్ బై ఎలక్షన్ తరువాత బీజేపీ నేతలు కరోనా బారిన పడటమే దీనికి కారణం. కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ రావడానికి కూడా నాగార్జున సాగర్ ప్రచార సభనే కారణం అనే వాదనలు వినిపిస్తున్నాయి. 

సాగర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ రవి నాయక్ ఇప్పటికే హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. సాగర్ బీజేపీ నేతలు  నివేదితారెడ్డి, శ్రీధర్ రెడ్డిలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా కరోనా బారిన పడి సోమాజీగూడ యశోదాలో చికిత్స పొందుతున్నారు. 

ఇలా వరుస కరోనా కేసులతో కమలనాథుల్లో ఆందోళన నెలకొంది. దీంతో కరోనా నిర్ధారణ టెస్టులకు క్యూ కడుతున్నారు. 

కేసీఆర్ కు కరోనా: కొంప ముంచిన నాగార్జునసాగర్ ప్రచార సభ?...

ఇదిలా ఉంటే సోమవారం కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నాగార్జునసాగర్ శాసనసభకు జరిగిన ఉప ఎన్నిక కారణంగానే వైరస్ సోకినట్లు అర్థమవుతోంది. కరోనా విస్తరిస్తున్న స్థితిలో లక్ష మందితో కేసీఆర్ సభ ఎలా పెడుతారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.ఆ ప్రశ్నకు కేసీఆర్ ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభల్లో పాల్గొనగా లేనిది, తాను పాల్గొంటే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.

కరోనా విస్తరణను బేఖాతరు చేస్తూ ఆయన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచార సభలో పాల్గొన్నారు. అదే కేసీఆర్ కు కరోనా సోకడానికి కారణమైందనే ప్రచారం సాగుతోంది. నోముల భగత్ కు కరోనా పాజిటివ్ రావడం ఆ విషయాన్ని బలపరుస్తోంది.  తెలంగాణలోని నాగార్జునసాగర్ లో కరోనా పంజా విసిరింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలోనూ, పోలింగులోనూ కరోనా వైరస్ వ్యాపించినట్లు భావిస్తున్నారు.