కరోనా భయం ఎంతో మంది ప్రాణాల్ని బలి తీసుకుంటోంది. కరోనా వచ్చి ట్రీట్మెంట్ అందక చనిపోయేవారు కొందరైతే.. కరోనా సోకుతుందనే భయంతో చనిపోతున్నవారు మరి కొందరు. ఇక ఇంకొందరు కరోనాతో ఉపాధి కోల్పోయి.. ఆర్థిక ఇబ్బందుల తాళలేక..ఆరోగ్యంగానే ఉన్నా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

అలాంటి విషాదమే యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. ఓ ప్రైవేట్ టీచర్ కరోనా వల్ల ఉపాధి కోల్పోయి.. దిక్కు తోచక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం కంచన పల్లి గ్రామానికి చెందిన మామిడి రవివర్మ రెడ్డి (30) హైదరాబాద్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు.

 కరోనాతో పాఠశాలలు మూసివేయడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. కుటుంబ సభ్యులతో ఏమీ మాట్లాడలేదు. చివరికి తన ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. రవివర్మ కు భార్య, కుమారుడు ఉన్నారు. ఈ పరిణామానికి కుటుంబమంతా షాక్ కు గురయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.