నిజామాబాద్: కరోనాతో బాధపడుతూ హాస్పిటల్లో చేరిన ఓ నిండు గర్భిణి ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన శిశువులకు కరోనా పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్ తేలింది. ఇలా కరోనా సోకిన తల్లి ముగ్గురు ఆరోగ్యవంతమైన బిడ్డలను జన్మనిచ్చింది. 

వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా యడపల్లి మండలం  జైతాపూర్ గ్రామానికి చెందిన ఓ నిండు గర్బిణి రోనా బారిన పడింది. దీంతో కుటుంబసభ్యులు చికిత్సనిమిత్తం ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేయగా ముగ్గురు శిశువులను జన్మనిచ్చింది. 

ఇలా పుట్టిన ముగ్గురు చిన్నారులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ గా తేలింది. అంతేకాకుండా ముగ్గురు చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంతో వున్నట్లు డాక్టర్లు తెలిపారు. తల్లికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ గా తేలడంతో తల్లీ బిడ్డలు ఆనందంగా ఇంటికి చేరుకున్నారు.