కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. ఇంటికి ఎవరూ రావద్దని.. తాము ఎవరింటికీ వెళ్లమని.. చెబుుతున్నారు. 
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ‘దయచేసి మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి ఎవ్వర్నీ రానివ్వకండి’ అంటూ ఇళ్లముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

రామగుండం నగరపాలక సంస్థ 31వ డివిజన్ లో ఎల్ బీ నగర్ వాసులు ‘కలిసి కట్టుగా పోరాడుదాం.. కరోనా మహమ్మారిని ఖతం చేద్దాం.. మాస్క్ ధరిద్దాం, భౌతిక దూరం పాటిద్దాం’ అంటూ తమ ఇళ్ల ముందు ఏర్పాటు చేసుకున్న బ్యానర్లు ఆలోచింపజేస్తున్నాయి. 

ఇక జడ్చర్ల టౌన్ లోనూ ఇలాంటి పోస్టర్లే దర్శనమిచ్చాయి. ‘నాతో పని ఉందా.. అయితే సెల్ నంబర్ కు ఫోన్ చేయండి.. ఎన్నికల ప్రచారమా.. కరపత్రాలు పక్కన బ్యాగులో వేసి వెళ్లండి. ఇంట్లోకి మాత్రం రావద్దు’ అంటూ తాళం వేసిన ఇంటిగేటుకు బోర్డు పెట్టారు.

కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండడంతో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్న క్రాంతి అనే వ్యక్తి ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

జడ్చర్లలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరందుకోవడంతో అభ్యర్థులు, వారి అనుచరులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ జాగ్రత్తలు తీసుకున్నానని అతను చెబుతున్నాడు. 

హైదరాబాద్  మల్కాజిగిరిలోనూ ఇలాంటి బోర్డులే దర్శనమిస్తున్నాయి. మా ఇంటికి రావద్దు.. మీ ఇంటికీ రానివ్వద్దూ అంటూ బోర్డులు పెడుతున్నారు. 

జగిత్యాల జిల్ల రాయికల్ మండలం కట్కాపూర్ లో కరోనా బారిన పడి తండ్రీ కొడుకులు తొమ్మిది రోజుల వ్యవధిలో మృతి చెందడం విషాదాన్ని నింపింది. కొడుకు గంట రంజిత్ (30), ఈ నెల 9న చనిపోగా, తండ్రి గంటా మల్లా రెడ్డి (63) ఆదివారం ప్రాణాలు విడిచాడు.