సిద్ధిపేట: ప్రేయసితో వివాహేతర సంబంధం నెరుపుతూ భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన పోలీసు కానిస్టేబుల్ సస్పెన్షన్ కు గురయ్యాడు. మద్దూరు పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ను చేర్యాలలో ప్రేయసితో ఉండగా అతని భార్య, కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. 

అద్దెకు తీసుకున్న ఇంట్లో వారిద్దరినీ పట్టుకున్న సమయంలో హైడ్రామా చోటు చేసుకుిది. కానిస్టేబుల్ రమేష్ ను, అతని ప్రేయసి అనూషను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత చేర్యాల పోలీసులకు అప్పగించారు. 

రమేష్ కు మమతతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. దంపతులకు ఇరువురు కూతుళ్లు కూడా ఉన్నారు. గత జులై నుంచి తనకు రమేష్ దూరంగా ఉంటున్నాడని మమత అంటోంది. కొద్ది నెలలుగా ఇంటికి దూరంగా ఉంటున్నాడని, అయితే పని మీద వెళ్లి ఉంటాడని భావిస్తూ వచ్చానని ఆమె అన్నది. 

ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడూ ఫోన్ లో మాట్లాడుతూ అర్థరాత్రి వరకు బిజీగా ఉండేవాడని చెప్పింది. అయితే, చేర్యాలలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడని తనకు తర్వాత తెలిసిందని, దాంతో తనకు అనుమానాలు కలుగుతూ వచ్చాయని అన్నారు. 

అనూషతో కూడా రమేష్ కూడా నెల వయస్సు గల పాప ఉందని చేర్యాల సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎల్ రఘు చెప్పారు. అనూషకు కూడా ఇది వరకే వివాహమైంది. భర్తతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడింది. 

తన భర్తపై ఫిర్యాదు ఇవ్వడానికి నిరుడు మద్దూరు పోలీసు స్టేషన్ కు వెళ్లింది. అప్పుడే రమేష్ తో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి వారిద్దరి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని అంటున్నారు. 

కానిస్టేబుల్ రమేష్ ను పోలీసు కమిషనర్ డియ జోయెల్ డేవిస్ వెంటనే సస్పెండ్ చేశారు.