రేవంత్ రెడ్డి గారు ... తెలంగాణ అవతరణ వేడుకల్లో ఆంద్రోళ్ల పెత్తనమా..? చంద్రబాబు గెెలిస్తే ఇక అంతేనా..!!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమయ్యింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి.
హైదరాబాద్ : జూన్ 2... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయంగానే కాదు అన్ని రంగాల్లోనూ సీమాంధ్రుల పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ఆత్మగౌరవ నినాదంలోంచి స్వరాష్ట్ర ఉద్యమం పుట్టింది. ఎన్నో ఏళ్ళ పోరాటం, ఎందరో అమరవీరుల త్యాగఫలమే ఇప్పుడున్న తెలంగాణ. జూన్ 2, 2014న అధికారికంగా భారత దేశంలో 28వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
అయితే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన బిఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ వైపు నిలిచింది... దీంతో కేసీఆర్ గద్దెదిగి రేవంత్ రెడ్డి గద్దెనెక్కాడు. ఇలా ఎప్పుడైతే బిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటినుండి మళ్లీ తెలంగాణ ఆత్మగౌరవ నినాదం మొదలైంది. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో అది పీక్స్ కు చేరింది.
వివాదం రాజేసిన తెలంగాణ గీతం :
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ రచయిత రాసిన 'జయజయహే తెలంగాణ జననీ జయ కేతనం' పాట కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ అస్తిత్వాన్ని చాటే ఈ పాట ఉద్యమకారులకు ఆయుధంగా మారింది... స్వరాష్ట్ర కాంక్షను నిజం చేసింది. ఇలా ఉద్యమకాలంలో ప్రతి తెలంగాణ బిడ్డ నోట వినిపించిన ఈ పాట కాలక్రమేణ ఆదరణ కోల్పోయింది. బిఆర్ఎస్ ప్రభుత్వ తీరువల్లే ఈ పాట మరుగున పడినట్లు స్వయంగా రచయిత అందెశ్రీ ఆరోపించారు.
అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అందెశ్రీ పాటను అదరించేందుకు ముందుకు వచ్చింది. 'జయజయహే తెలంగాణ'ను రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అంతేకాదు సరికొత్త స్వరాలతో ఈజీగా పాడుకునేలా ఈ గీతాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఇంతవరకు అంతా బాగానే వుంది... కానీ తెలంగాణ గీతానికి సంగీతాన్ని అందించే బాధ్యత మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి అప్పగించడంతో వివాదం రాజుకుంది.
ఆంద్రోళ్ల పెత్తనానికి వ్యతిరేకంగానే తెలంగాణ ఏర్పడింది... అలాంటిది మళ్లీ వారికి పెత్తనం అప్పగించటం ఏమిటంటూ రేవంత్ సర్కార్ ను ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్ నిర్ణయాలు వుంటున్నాయని... రాష్ట్ర గీతాన్ని ఆంధ్రాకు చెందిన కీరవాణి చేతిలో పెట్టడం ఏమిటంటూ నిలదీస్తున్నారు. ఇది తెలంగాణ కళాకారులను అవమానించడమేనని మండిపడుతున్నారు.
బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రేవంత్ రెడ్డి నిర్ణయాలు మళ్ళీ తెలంగాణలో ఆంధ్రోళ్ల పెత్తనాన్ని పెంచేలా వున్నాయంటూ మండిపడుతున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా కీరవాణికి రాష్ట్ర గీతం స్వరకల్పన బాధ్యతలు ఓ ఆంధ్రా మ్యూజిక్ డైరెక్టర్ కు అప్పగించడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. కళాకారులకు నిలయమైన తెలంగాణలో రాష్ట్ర గీతానికి సంగీతం అందించేందుకు ఒక్కరు కూడా దొరకలేదా అంటూ రేవంత్ ను నిలదీస్తున్నారు బిఆర్ఎస్ నేతలు.
ఇక తెలంగాణ గీతం స్వరకల్పన బాధ్యతలు కీరవాణి అప్పగించడానికి అదేమీ ‘నాటు నాటు’ పాట కాదని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేసారు. తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు పెత్తనం ఏంది భై? ఈ గీతానికి కొత్తగా స్వరకల్పన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?? అయినా తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలం? అదీ తెలంగాణ వచ్చి పదేళ్లయినంక?? అంటూ నిలదీసారు.
నాటి ఆంధ్ర పాలకుల పెత్తనం పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వందలాది మంది అమరుల త్యాగాలు, నాలుగు కోట్ల ప్రజల కలల ప్రతి రూపం... ఒక రణ నినాదం... ధిక్కార స్వరం అందెశ్రీ రాసిన జయజయహే పాట అని అన్నారు. తెలంగాణ సమాజం పాడుకునే ఒరిజినల్ ట్యూన్ ను కొనసాగిస్తే సరిపోయేదన్నారు ప్రవీణ్. ప్రజలు ఈ గీతాన్ని సామూహికంగా ఆలాపించిన తీరు చూసుంటే మీరు ఈ దుస్సాహసం చేయరు... అయినా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేరు కాబట్టి ఈ పాటను వినివుండరు అంటూ సీఎం రేవంత్ ను ఎద్దేవా చేసారు.
బిఆర్ఎస్ నాయకులే కాదు తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు కూడా రాష్ట్ర గీతం వివాదంపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన జర్నలిస్ట్ పాశం యాదగిరి నిలదీసారు. ఇప్పుడు తెలంగాణ గీతాన్ని ఆంధ్రా మ్యూజిక్ డైరెక్టర్ కు అప్పగించారు... రేపు చంద్రబాబు గెలిస్తే రాష్ట్రాన్ని ఆంధ్రలో కలిపేస్తారేమో అంటూ మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకొని దశాబ్ది ఉత్సవాలు ఎలా చేస్తారు.... తెలంగాణ ఐక్య వేదిక తరపున ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామంటూ మహేష్ గౌడ్ ఎదుటే పాశం యాదగిరి పిలుపునిచ్చారు.
తెలంగాణ గీతం వివాదంపై తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ కూడా స్పందించింది. ''జయ జయహే తెలంగాణ' పాటకు కీరవాణిని సంగీతం అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుంది. తెలంగాణ అస్తిత్వం మీకు తెలియంది కాదు... మన ఉద్యోగాలు, మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సకల జనుల సహకారంతో ఎంతో మంది అమర వీరుల త్యాగ ఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రం. ఇంతటి ఖ్యాతి గడించిన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడటమేంటి? అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుంది. ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణాలో ఉన్నారు... కాబట్టి మనవారికే ఈ గొప్ప అవకాశాన్ని ఇవ్వాలి. తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం' అని తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ అధికారిక చిహ్నంపైనా వివాదం :
ఓవైపు తెలంగాణ గీతంపై వివాదం సాగుతుండగానే రాష్ట్ర అధికారిక చిహ్నంపై వివాదం రాజుకుంది. ఇప్పుడున్న రాష్ట్ర చిహ్నంలో చారిత్రాత్మక చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించాలన్న ఆలోచనలో రేవంత్ సర్కార్ వుందని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై నిర్ణయం కూడా తీసుకున్నారని... కొత్త చిహ్నం కూడా రెడీ అయినట్లు సమాచారం. రాచరికపు ఆనవాళ్లను తొలగించాలన్న ఉద్దేశంతోనే అధికారిక చిహ్నంలో మార్పులు చేసామని అధికార పార్టీ అంటుంటే... ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడమేనని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది.
తాజాగా మాజా మంత్రి కేటీఆర్ రాష్ట్ర చిహ్నం మార్పుపై స్పందించారు. ప్రస్తుతం తెలంగాణ పాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందంటూ కేటీఆర్ మండిపడ్డారు. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ తయారుచేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా-జమునా తహజీబుకి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడనట... కానీ రాష్ట్రగీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి “గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్“ అని పాడుకోవాలి !!?? “కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప” అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి !!?? అసలు ముఖ్యమంత్రికి గాని, ఆయన మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్ట్రగీతంలో ఏమున్నదో తెలుసా ? అంటూ కేటీఆర్ ఎద్దేవా చేసారు.
తెలంగాణ తల్లి విగ్రహ మార్పు :
ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తామని అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతమున్న తెలంగాణ తల్లి విగ్రహం కూడా తలపై కిరీటంతో రాచరికానికి చిహ్నంగా వుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వారి డిమాండ్ ను పరిగణలోకి తీసుకునే తెలంగాణ అస్తిత్వం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు చేపడతామని రేవంత్ కేబినెట్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని కూడా బిఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.