సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. సీఎం వ్యవసాయ క్షేత్రంలో విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్లు ఏకే 47 రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఒక్కసారిగా తుపాకీ శబ్ధం వినిపించడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అక్కడికి వెళ్లిచూడగా కానిస్టేబుల్ రక్తం మడుగులో పడివున్నాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

వెంకటేశ్వర్లు స్వస్థలం నల్గొండ జిల్లా ముత్తిరెడ్డిగూడెం వాసి. దీనిపై సిద్ధిపేట కమీషనర్ జోయల్ డెవిస్ మాట్లాడుతూ..కానిస్టేబుల్ మద్యం మత్తులోనే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

అతను గత కొంతకాలంగా విధులకు హాజరుకావడం లేదని భార్య ఒత్తిడి తీసుకురావడంతో తిరిగి విధుల్లోకి తీసుకున్నామని సీపీ స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలతోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడని కమీషనర్ వెల్లడించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యవసాయంపై ఉన్న ఆసక్తి తెలిసిందే. ఏ మాత్రం తీరిక దొరికినా ఆయన తన ఫాంహౌస్‌లో వాలిపోతారు. అక్కడేవున్న పంటలు, మొక్కలను పరిశీలిస్తూ సేదతీరుతారు.

వ్యవసాయం చేసుకుంటూ ఎర్రవల్లిలోనే స్ధిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచలనలో సీఎం ఉన్నట్లు సన్నిహితులు చెబుతూ ఉంటారు. వ్యవసాయంలో ఎప్పటికప్పుడు ఆధునిక సేద్యపు విధానాలు అవలంభిస్తూ కేసీఆర్ మంచి దిగుబడులు  సాధిస్తున్నారు. 

హైదరాబాద్ శివార్లలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో కానిస్టేబుల్ గత నెల ఆత్మహత్య చేసుకున్నారు.  ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఆర్ధిక ఇబ్బందులతోనే శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. మరోవైపు పోలీస్ శాఖలో వరుస ఆత్మహత్యల ఘటనలతో ఉద్యోగులు కలవరపాటుకు గురవుతున్నారు.