పెళ్లయిన నాలుగు నెలలకే ఓ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడటం కుటుంబసభ్యులను విషాదంలోకి నెట్టింది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా దిండి మండలం ఖానాపూర్‌ గ్రామానికి చెందిన సైదులు మర్రిగూడెం పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

అతనికి గత ఏడాది నవంబర్‌లో వివాహమైంది. అప్పటి నుంచి దంపతులు మర్రిగూడెంలోనే నివాసం ఉంటున్నారు. భార్యభర్తల మధ్య తరచూ చిన్నపాటి గొడవలు చోటు చేసుకునేవి.

ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన సైదులు భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. అక్కడి నుంచి నేరుగా తిరుమలేశుని గుట్ట సమీపానికి వెళ్లిన సైదులు రంగారెడ్డి జిల్లా యాచారం మండల శివారులోని ఓ వెంచర్‌లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అతనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న యాచారం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.