హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనకు కాంగ్రెస్ పార్టీ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 1న అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు. దాంతోపాటు మేనిఫెస్టోను కూడా విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. 

ఇకపోతే టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో ప్రజాకూటమిని ఏర్పాటు చేసింది. అయితే ప్రజాకూటమిలో పార్టీలకు సీట్ల సర్దుబాటు కంటే కాంగ్రెస్ పార్టీలో సీట్ల సర్దుబాటే పెద్ద సమస్యగా మారింది. 

వాస్తవంగా చెప్పాలంటే అభ్యర్థుల ఎంపికపై ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ పెద్ద కసరత్తు చేసిందని చెప్పాలి. ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పట్టింది. పార్టీలో సీనియర్ నేతలు తమతోపాటు తమ వారసులకు కూడా టిక్కెట్లు ఇవ్వాలంటూ టీపీసీసీ పైనా, ఏఐసీసీ పైనా తెగ ఒత్తిడి తెచ్చారు. 

అయితే ఒకే కుటుంబానికి ఒకే టిక్కెట్ అన్న నినాదానికి కాంగ్రెస్ అదిష్టానం ఓటెయ్యడంతో ఆశావాహులు వెనక్కి తగ్గారు. ఇకపోతే ప్రజాకూటమిలో సీట్ల లొల్లి కూడా ఓ కొలిక్కి రాలేదు. సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీ టిక్కెట్ల పై కూడా ఒక ఖచ్చితమైన ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో నవంబర్ ఒకటిన కాంగ్రెస్ పార్టీ జాబితా విడుదల అయితే ఇతర పార్టీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తున్నారన్న విషయం తెలుస్తుంది.