హైదరాబాద్: బ్యాలెట్ పేపర్లపై స్వస్తిక్ గుర్తుతో కాకుండా పెన్నుతో  కూడ టిక్ చేస్తే  ఓటు వేసినట్టుగా గుర్తించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

స్వస్తిక్ గుర్తు కాకుండా ఏ ఇతర గుర్తుతో ఓటు వేసి ఉన్నా ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది.పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్ ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్  సి.పార్ధసారథికి ఈ విషయమై లేఖ రాశారు.

ఎన్నికల సంఘం తీసుకొన్న నిర్ణయం అనేక అనుమానాలకు తావిచ్చేదిగా  ఉందని ఆ పార్టీ అభిప్రాయపడింది. తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహించడం వల్లే ఈ తప్పిదాలు జరిగాయని వివరించారు.

గ్రేటర్ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు ఉన్నవాటినే కాకుండా సంబందింత పోలింగ్ కేంద్రాన్ని సూచించే స్టాంపు వేసినా ఓట్లుగా పరిగణించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.


జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందు ఎన్నికల సంఘం ఈ ఉత్తర్వులు జారీ చేయడంపై బీజేపీ, కాంగ్రెస్ సహా  ఇతర విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.ఈ విషయమై బీజేపీ హైకోోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.