ఖమ్మం: సినీనటుడు ఎన్నికల ప్రచారంలోకి వస్తే సినీ స్టైల్లో డైలాగులు చెప్తారు. కవులు, కళాకారులు కవితలతో పాటలతో ఊకదంపుతారు. ఇక క్రికెటర్లు అయితే ఒక్కో పంచ్ ను ఒక్కోలా వర్ణిస్తారు. అదే జరిగింది టీం ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ విషయంలో. 

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన ఆయన ఖమ్మం జిల్లాలో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా టీమిండియా క్రికెట్‌ జట్టు తరహాలో మహాకూటమి కూడా బలంగా ఉందంటూ అజహర్ వ్యాఖ్యానించారు.  

ప్రజాకూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. మైనార్టీల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీలు కుమ్మకై రాజకీయాలు చేస్తున్నాయని ఇరు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని అజహర్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

ముస్లింలకు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్‌ హామీ ఏమైందని అజహరుద్దీన్‌ నిలదీశారు. నాలుగున్నరేళ్ల పాలనలో హామీల అమలులో టీఆర్‌ఎస్‌ విఫలమైందన్నారు. హామీల గురించి ప్రశ్నించే వారిపై సీఎం కేసీఆర్‌ అసహనంతో, అసభ్య పదజాలంతో దురుసుగా ప్రవర్తిస్తారని అజహర్‌ విమర్శించారు. 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, టీజేఎస్ అధినేత కోదండరాం కలయిక క్రికెట్ లో తాను, సచిన్ ల భాగస్వాముల మాదిరిగా విజయం సాధిస్తుందన్నారు. ఖమ్మంలో అభివృద్ధి కోసం ప్రజా కూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించాలని కోరారు.