తెలంగాణలో బీజేపీని తుడిచిపెడతాం.. అక్కడ విజయం మాదే: రాహుల్ గాంధీ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీ ఆనవాళ్లు కూడా ఉండవని కామెంట్ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీ ఆనవాళ్లు కూడా ఉండవని కామెంట్ చేశారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో బీజేపీని మట్టికరిపించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్-యుఎస్ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో జరిగిన విందు కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ కామెంట్స్ చేశారు.
ఈ విందు సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్ కూడా హాజరైన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక, కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు, ప్రవాస భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీని మట్టికరిపించగలమని కర్ణాటకలో చూపించామని చెప్పారు. బీజేపీని ఓడించడమే కాదు.. చిత్తు చేశామని అన్నారు. కర్ణాటకలో వాళ్లను చిత్తు చేశాం. వాళ్లు అక్కడ చేయాల్సిదంతా చేశారు. మా దగ్గర ఉన్న డబ్బు కంటే వాళ్ల వద్ద 10 రెట్లు డబ్బు ఉంది. వారికి ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు.. అన్నీ ఉన్నాయి. అయితే మేము వారిని ఓడించగలిగాం. తదుపరి తెలంగాణలో మేము వారిని నిర్మూలించబోతున్నామని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను’’ అని రాహుల్ గాంధీ చెప్పారు.
కర్ణాటకలో బీజేపీ ప్రజలను పోలరైజ్ చేసేందుకు ప్రయత్నించిందని.. ప్రధానమంత్రి కూడా ఇందుకోసం ప్రయత్నించారని అన్నారు. అయితే వారి ప్రణాళిక పనిచేయలేదని అన్నారు. బీజేపీని ఓడించేది కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదని.. భారతదేశ ప్రజలు అని చెప్పారు. ‘‘మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ ప్రజలే బీజేపీకి బుద్ధి చెబుతారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సమాజంలో బీజేపీ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంది. రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాల్లో ఇదే జరగబోతోంది. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే చేస్తాం.. విపక్షాలు ఐక్యంగా ఉన్నాం. అందరం కలిసి పని చేస్తున్నాం. ఇది సైద్ధాంతిక పోరు’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.