Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెసు, టీడిపి పొత్తు: కేసీఆర్ చిత్తుకు ప్లాన్ ఇదీ...

వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును చిత్తు చేయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసి అడుగులు వేసే ఆలోచనలో ఉన్నాయి.

Congress, TDP proposed tie-up for 2019 Assembly elections

హైదరాబాద్: వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును చిత్తు చేయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసి అడుగులు వేసే ఆలోచనలో ఉన్నాయి. పొత్తు వ్యవహారం ఓ కొలిక్కి రాకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)ను ఓడించడానికి అవసరమైన ప్రణాళికలను మాత్రం సిద్ధం చేస్తున్నాయి.

హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునే విధంగా ఆ ప్రణాళిక సిద్ధమతువుతున్నట్లు సమాచారం. ఈ రెండు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు గణనీయమైన సంఖ్యలో ఉండి నిర్ణాయక పాత్ర వహించే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిస్తే టీఆర్ఎస్ ను ఈ రెండు జిల్లాల్లోని చాలా స్థానాల్లో ఓడించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ఇక్కడి ఆంధ్రప్రదేశ్ ప్రజలనూ ఆగ్రహానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో బిజెపికి టీఆర్ఎస్ దగ్గరవుతూ ప్రత్యేక హోదా డిమాండును దెబ్బ తీసే ప్రయత్నం చేస్తోందనే ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కాంగ్రెసు, టీడీపిలు అనుకుంటున్నాయి. 

నిజానికి, హైదరాబాదు, రంగా రెడ్డి జిల్లాల్లో టీఆర్ఎస్ కు తగిన బలం లేదు. అయితే, గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఆత్మస్థయిర్యాన్ని సంతరించుకుంది. అదే విధంగా ఈ రెండు జిల్లాల్లో కాంగ్రెసు, టీడీపిల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంది. 

గత ఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు గాను టీఆర్ఎస్ 62 స్థానాలను గెలుచుకుంది. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 24 శాసనసభ స్థానాలుండగా టీఆర్ఎస్ కు దక్కినవి మూడు మాత్రమే.  శాసనసభ ఎన్నికల తర్వాత రెండేళ్లకు జరిగిన గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో మాత్రం 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను గెలుచుకుని తిరుగులేని బావుటా ఎగురేసింది. అంతకు ముందు ఏ పార్టీకి కూడా రానన్ని స్థానాలు టీఆర్ఎస్ కు వచ్చాయి. 

గత శాసనసభ ఎన్నికల్లో టీడీపి, బిజెపి కలిసి 14 స్థానాలను గెలుచుకున్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో కాంగ్రెసు, టీడీపికి కలిపి గణనీయం ఓటు బ్యాంకు ఉంది. అందువల్ల పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్ ను ఓడించడం ఖాయమనే భావన కాంగ్రెసు, టీడీపి వర్గాల్లో వ్యక్తమవుతోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios