ఓడింది బీఆర్ఎస్.. కేసీఆర్ కాదు, ఆ ఇమేజ్‌నే టార్గెట్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్‌కు మళ్లీ ఛాన్స్ ఇవ్వకూడదని రేవంత్ రెడ్డి అండ్ కో పావులు కదుపుతోంది. ఎన్నికల్లో ఓటమి పాలైనా చంద్రశేఖర్ రావు ఇమేజ్ చెక్కుచెదరలేదు. ఇప్పటికీ బీఆర్ఎస్ బ్రాండ్ అంబాసిడర్ కేసీఆరే. తెలంగాణ ప్రజానీకంలో ఓడింది బీఆర్ఎస్ పార్టీయే కానీ.. కేసీఆర్ కాదనే వాదన బలంగా వుంది.
పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జోష్‌లో వుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని కృతనిశ్చయంతో వుంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతం అధికారంలో వుండటంతో అన్ని రకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్ధిగా వున్న బీఆర్ఎస్, కేంద్రంలో తనకు అడ్డుగా వున్న బీజేపీతోనూ ఇక్కడ కాంగ్రెస్ పోరాడాల్సి వుంది. మూడు పార్టీలు తెలంగాణలోనూ బలంగానే వున్నాయి. బీజేపీ కంటే ముందు పరాజయం భారంతో వున్న గులాబీ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో కమ్ బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. లేనిపక్షంలో పార్టీ ఉనికే ప్రశ్నార్ధకంగా మారుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అనారోగ్యంగా వున్నప్పటికీ నల్గొండ సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు చేశారు.
అయితే కేసీఆర్‌కు మళ్లీ ఛాన్స్ ఇవ్వకూడదని రేవంత్ రెడ్డి అండ్ కో పావులు కదుపుతోంది. ఎన్నికల్లో ఓటమి పాలైనా చంద్రశేఖర్ రావు ఇమేజ్ చెక్కుచెదరలేదు. ఇప్పటికీ బీఆర్ఎస్ బ్రాండ్ అంబాసిడర్ కేసీఆరే. ఆయన బొమ్మను పెట్టుకునే ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లాల్సి వుంటుంది. ఇప్పటికీ గ్రామీణులు కేసీఆర్ అంటే సార్ అంటూ గుండెల్లో పెట్టుకుంటారు. ఇలాంటి ఇమేజ్‌తో ఎప్పటికైనా తమకు నష్టమేనని కాంగ్రెస్ భావిస్తోంది . ఈ ఐదేళ్లు తన అధికారాన్ని సుస్ధిరంగా కాపాడుకోవాలంటే పటిష్టమైన పునాదులు వుండాల్సిందేనని ఆ పార్టీ వ్యూహం.. అది జరగాలంటే బలమైన కేసీఆర్‌ను బలహీనపరచాల్సిందే.
అందుకే కాంగ్రెస్ ఇప్పటి నుంచే ఎదురుదాడి ప్రారంభించింది. ప్రాజెక్ట్‌లు, సంక్షేమ పథకాలు, విద్యుత్, రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ.. అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు ప్రజాప్రతినిధులను తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. తద్వారా బీఆర్ఎస్ పార్టీని వీక్ చేసి .. లోక్‌సభ ఎన్నికల్లో సానుభూతి పవనాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజానీకంలో ఓడింది బీఆర్ఎస్ పార్టీయే కానీ.. కేసీఆర్ కాదనే వాదన బలంగా వుంది. దీనిని బట్టి క్షేత్రస్థాయిలో చంద్రశేఖర్ రావు ఎంత స్ట్రాంగో చెప్పవచ్చు. అందుకే కేసీఆర్ ఎంత వీక్ అయితే బీఆర్ఎస్ అంత వీక్ అవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్ ఇమేజ్‌ను టార్గెట్ చేయడం ప్రారంభించారని విశ్లేషకులు అంటున్నారు.
అయితే నాలుగు దశాబ్ధాల రాజకీయ జీవితం, ఎమ్మెల్యేగా , ఎంపీగా, కేంద్ర మంత్రిగా , సీఎంగా పనిచేసిన కేసీఆర్‌ను అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఇంతకంటే క్లిష్టమైన పరిస్ధితుల నుంచి పార్టీని గట్టెక్కించి , అసాధ్యమనుకున్న ప్రత్యేక తెలంగాణను సాధించిన చాతుర్యం చంద్రశేఖర్ రావు సొంతం. అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న ఆయన కాంగ్రెస్‌కు అంత ఛాన్స్ ఇస్తారా . ఇప్పటికే తన గేమ్ స్టార్ట్ చేసిన కేసీఆర్.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ జోరుకు బ్రేకులు వేయాలని భావిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతోందో.