ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా నాయక్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నియోజకవర్గ పరిధిలో ఓటింగ్ సరళిని పరిశీలించడంలో భాగంగా ఆమె ఉట్నూరుకు వెళ్లారు. అక్కడ ఓ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన ఆమెతో పాటు భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. దీంతో అక్కడ వున్న కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డుకోడానికి ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య మధ్య ఘర్షణ తలెత్తింది. అక్కడే వున్న పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.  

పోలింగ్ సందర్భంగా మరికొన్ని చోట్ల కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలాగే ఖైరతాబాద్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో చెదురు మదురుగా కొన్ని ఉద్రిక్త సంఘటనలు చోటుచేసుకున్నాయి. కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి పై బిజెపి నాయకులు దాడికి పాల్పడగా ఆయన తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారు. 

ఇవాళఈ ఉదయం 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం కాగా 11 గంటల  కల్లా తెలంగాణలో 17 శాతం ఓట్లు పోలయ్యాయి.  అయితే మధ్యాహ్నానికి ఓటింగ్ శాతం పుంజుకుని 49.15 శాతంగా నమోదయ్యింది. మద్యాహ్నం 3 గంటల వరకు 56.17 శాతం ఓట్లు పోలయ్యాయి.