సిరిసిల్ల ఘటన తో మరోక్క సారి  టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి, అక్రమాలు బట్టబయలు అయ్యాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం  పర్సంటేజీలు, కమీషన్ల ప్రభుత్వ మని సాక్షాత్తూ సిరిసిల్ల ఛైర్ పర్సన్ నిజాయితీగా చెప్పారు. నిజాలు మాట్లాడినందుకు ఆమెను బలవంతంగా రాజీనామా చేయించి తమ ఆధిపత్యాన్ని మరో మారు మంత్రి కేటీఆర్ నిరూపించుకున్నారు. రాజీనామా చేయించి మహిళా ప్రతినిధిని బలిచేసి,  తానుమాత్రం  చాలా తెలివిగా తప్పించుకున్నారు. దీన్ని బట్టే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఎలా దోచుకుంటుందో, మంత్రి కేటీఆర్  కమీషన్లను ఎలా ప్రోత్సహిస్తున్నరో, ఆయన నిజస్వరూపమేంటో  గమనించొచ్చు. రాష్ట్రానికి సిఎం కావాల‌నుకుంటున్న మంత్రి కేటీఆర్ అవినీతిని ప్రోత్స‌హిస్తున్నార‌ని సాక్ష్యాధారాలు దొరికినా ఆయ‌న‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదో ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పాల‌ని టిపిసిసి అధికార‌ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్ డిమాండ్ చేసారు. అవినీతి విష‌యంలో రాజ‌య్య‌కో నీతి, కేటీఆర్‌కు మ‌రోనీతి వ‌ర్తిస్తుందా అని నిల‌దీసారు. మంత్రి  కేటీఆర్ ను మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్‌ చేసి, ఆయ‌న ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన  అవినీతిపై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేసారు. 

సిరిసిల్ల మున్సిప‌ల్ ఛేర్‌ప‌ర్స‌న్ పావ‌ని అవినీతి గురించి మాట్లాడిన కొన్ని గంట‌ల్లోనే ఆమెతో ప‌ద‌వికి రాజీనామా చేయించ‌డంపై  శ్ర‌వ‌ణ్ మీడియాకు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో కేటీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన సిరిసిల్ల‌లో వెలుగుచూసిన అవినీతి రాష్ట్రంలో పెద్ద ఎత్తున‌ జ‌రుగుతున్న అవినీతికి మ‌చ్చుతున‌క అని వ్యాఖ్యానించారు. పావ‌ని మీడియా ప్ర‌తినిధుల ఎదుట మాట్లాడిన మాట‌ల్లో అనేక వాస్త‌వాలు ఉన్నాయ‌నే విష‌యం గుర్తించాల‌ని శ్ర‌వ‌ణ్ కోరారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కార‌ణంగా సిరిసిల్ల మున్సిపాలిటీకి భారీగా నిధుల‌ను కేటాయించార‌ని, అయితే ఆ నిధుల‌తో చేప‌ట్టిన అభివృద్ధిప‌నుల కాంట్రాక్టుల‌ను పార‌ద‌ర్శ‌కంగా కాంట్రాక్టు విధానంలో కాకుండా త‌న అనుచ‌రుల‌కు కేటాయించార‌ని ఆరోపించారు. సిరిసిల్ల‌లోని అన్ని వార్డుల్లోనూ ప‌నుల‌ను సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డిగా ఒకే కాంట్రాక్ట‌ర్ చేప‌డుతున్నార‌ని పావ‌ని చెప్పిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ఒక్కోవార్డు ప‌నుల‌ను ఒక్కొక్క‌రికి గుత్తాధిప‌త్యంతో అప్ప‌గించి వారి ద్వారా 2 నుంచి 3 శాతం దాకా క‌మీష‌న్ల‌ను కౌన్సిల‌ర్ల‌కు ఇప్పిస్తున్నార‌ని కూడా మున్సిప‌ల్ ఛైర్మెన్ వెల్ల‌డించ‌డం జ‌రిగింద‌న్నారు. అయితే ఈ క‌మీష‌న్లు కేవ‌లం కౌన్సిల‌ర్లు, ఛైర్మెన్ దాకా మాత్ర‌మే ఉంటే టెండ‌ర్ వ్య‌వ‌హారాల‌ను కావాల్సిన విధంగా మార్చుకొనే అవ‌కాశం ఉండ‌ద‌ని, మంత్రి కేటీఆర్ ప్ర‌మేయం కూడా ఉన్న‌ప్పుడే అధికారులు అక్ర‌మాలు చేయ‌డానికి సాహ‌సిస్తార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. 2-3 శాతం దాకా క‌మీష‌న్లు తీసుకొమ్మ‌ని త‌మ‌కు మంత్రి కేటీఆరే అనుమ‌తిని ఇచ్చార‌నే విష‌యాన్ని పావ‌ని బ‌య‌ట‌పెట్టార‌ని గుర్తు చేసారు. ఈ విధంగా త‌న గుట్టు ర‌ట్టువుతోంద‌ని గుర్తించిన కేటీఆర్ రాత్రికి రాత్రే ఆమెతో త‌న ప‌ద‌వికి రాజీనామా చేయించార‌ని శ్ర‌వ‌ణ్ ధ్వ‌జ‌మెత్తారు.

కౌన్సిల‌ర్లు, ఛేర్మెన్‌ల‌కు పర్సంటేజీ తీసుకోవాల‌ని సూచించిన కేటీఆర్ త‌న‌వంతు ప‌ర్సంటేజీల‌ను తీసుకోకుండా ఉంటార‌ని ఎలా న‌మ్మ‌మంటారో చెప్పాల‌ని నిల‌దీసారు.ఈ ప‌ర్సంటేజీల వ్య‌వ‌హారం రాష్ట్ర‌మంత‌టా మంత్రి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంద‌నే విష‌యం కూడా పావ‌ని బ‌య‌ట‌పెట్టినా దీన్ని ముఖ్య‌మంత్రి ప‌ట్టించుకోక‌పోవ‌డం చూస్తే ఈ వ్‌ఉవ‌హారంలో సిఎం దాకా కూడా ముడుపులు ముడుతున్నాయ‌నే అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని చెప్పారు. ద‌ళితుడైన డెప్యుటీ సిఎం రాజ‌య్య అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఆరోపిస్తూ ఆయ‌న ఏం చేసాడ‌న్న‌ది తెలంగాణా స‌మాజానికి కూడా చెప్ప‌కుండా ప‌ద‌వి నుంచి తొల‌గించిన కేసీఆర్ త‌న కొడుకు అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని తెలిసినా ఆయ‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డానికి కార‌ణం కేటీఆర్ త‌న కొడుకు కావ‌డ‌మేనా? అని ప్ర‌శ్నించారు. ఇలాంటి ప‌క్ష‌పాత‌ధోర‌ణి చూపించే వ్య‌క్తి తాను దేశాన్ని ఉద్ద‌రిస్తానంటూ బ‌య‌లుదేర‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని శ్ర‌వ‌ణ్ ఎద్దేవా చేసారు.

అవినీతి విష‌యంలో సిఎంకు నిజంగానే చిత్త‌శుద్ధి ఉంటే  తన బంధువు చ‌నిపోయాడ‌ని వ‌రంగ‌ల్ ఎంజిఎం ఆస్ప‌త్రికి వెళ్తే తాను ప్ర‌జాప్ర‌తినిధిన‌ని తెలిసినా రూ.3 వేలు ఇచ్చేదాకా పోస్ట్‌మార్టం చేయ‌లేద‌ని టీఆర్ ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీ ల‌క్ష్మినారాయ‌ణ అధికారికంగా వెల్ల‌డించినా సంబంధిత అధికారుల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదో చెప్పాల‌ని శ్ర‌వ‌ణ్ డిమాండ్ చేసారు. ఎమ్మెల్సీ ల‌క్ష్మినారాయ‌ణ‌, మున్సిప‌ల్ ఛేర్‌ప‌ర్స‌న్ పావ‌ని వెల్ల‌డించిన విష‌యాలు రాష్ట్రంలో  భారీఎత్తున జ‌రుగుతున్న అవినీతికి మ‌చ్చుతున‌క‌ల‌ని పేర్కొన్నారు. అవినీతిర‌హిత‌మైన పాల‌న అందిస్తున్నాన‌ని చెప్పుకుంటున్న కేసీఆర్‌కు చిత్త‌శుద్ధి ఉంటే అవినీతికి పాల్ప‌డింది రాజ‌య్య అయినా, కేటీఆర్ అయినా త‌న‌కు ఒక్క‌టేన‌న్న నీతి ఉంటే కేటీఆర్‌ను త‌క్ష‌ణం మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసి, ఈ విష‌యంగా సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ‌కు ఆదేశించాల‌ని శ్ర‌వ‌ణ్‌కోరారు.ఈ వ్య‌వ‌హారాల‌పై తాము ఏసీబికి కూడా ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.