Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ రేవంత్.. ఒరిజినల్ కాంగ్రెస్ నినాదంతో ఏకతాటిపైకి సీనియర్లు.. టీ కాంగ్రెస్‌లో ముదిరిన రచ్చ..

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి‌కి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకతాటిపైకి వచ్చారు. ఇందుకు శనివారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన సీనియర్ నేతల సమావేశం వేదికగా నిలిచింది. 

congress senior leaders come united against revanth reddy with will save congress slogan
Author
First Published Dec 17, 2022, 3:19 PM IST

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి‌కి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకతాటిపైకి వచ్చారు. ఇందుకు శనివారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన సీనియర్ నేతల సమావేశం వేదికగా నిలిచింది. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మధుయాష్కి‌లతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం నేతలు మాట్లాడుతూ.. ఒర్జినల్‌ కాంగ్రెస్‌ నినాదంతో.. వలస వచ్చిన నేతల వల్ల పార్టీ నమ్ముకున్న వాళ్లకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉమ్మడి గళం వినిపించారు. టీపీసీసీ కమిటీల్లో బయటి నుంచి వచ్చినవారికే.. ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకే ఎక్కువ పదవులు దక్కాయని చెప్పారు. రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించనప్పటికీ.. వలస నాయకుడు, నాలుగు పార్టీలు మారిన వ్యక్తి  తెలంగాణలో కాంగ్రెస్‌ను ఉద్దరిస్తారా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని హస్తగతం చేసుకోవడానికో, ఇంకొకరికి అప్పజెప్పాలనో కుట్ర జరుగుతుందని కూడా ఆరోపించారు. 

సోషల్ మీడియా పోస్టులతో కాంగ్రెస్‌లో మొదటి నుంచి ఉన్న నాయకులపై కోవర్టులుగా ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత అనుకూల మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము కాంగ్రెస్‌లోనే పుట్టామని, కాంగ్రెస్‌లోనే ఉన్నామని, కాంగ్రెస్‌లోనే చస్తామని నేతలు స్పష్టం చేశారు. అసలైన కాంగ్రెస్‌వాదులకు న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమని.. అందుకే సేవ్ కాంగ్రెస్ కార్యక్రమంతో ముందుకు వెళ్లనున్నట్టుగా ప్రకటించారు.  

భట్టి విక్రమార్క నివాసంలో సమావేశం అనంతరం మాట్లాడిన ప్రతి ఒక్క నేత కూడా.. వలస నేతలు అనే పదాన్ని ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా రేవంత్ రెడ్డిని  టార్గెట్ చేశారని స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే పీసీసీ కమిటీల్లో రేవంత్ రెడ్డి తనకు నచ్చిన వారికే పదవులు వచ్చేలా చేసుకున్నారనే అర్థం వచ్చేలా నేతలు మాట్లాడారు. 

తొలి నుంచి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న సీనియర్లు.. 
కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరికను కూడా పలువురు సీనియర్లు కూడా వ్యతిరేకించారు. అయితే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు విషయంలో కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయం కావడంతో.. వ్యక్తిగత అభిప్రాయాలు భిన్నంగా ఉన్న చాలా మంది నేతలు సర్దుకుపోయారు. అయితే రేవంత్ రెడ్డికి టీపీసీ చీఫ్‌గా బాధ్యతలు ఇవ్వడంపై చాలా మంది సీనియర్ నేతలు గుర్రుగా ఉంటూ వస్తున్నారు. కొందరు నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరికొందరు లోపల అసంతృప్తితో ఉన్నకూడా బయటకు కనిపించకుండా జాగ్రత్త పడ్డారనే చెప్పాలి. 

Also Read: కమిటీల్లో 50 మంది టీడీపీ నుంచి వచ్చినవారే.. 4 పార్టీలు మారినవారు పార్టీని ఉద్దరిస్తారా?: ఉత్తమ్ సంచలనలం

అయితే రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలపై పలువురు సీనియర్లు ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే వచ్చారు. రేవంత్ రెడ్డి వారిని కలుపుకుపోవడంలో విఫలమయ్యారనే విమర్శ కూడా ఉంది. దీంతో పార్టీలో నాయకుల మధ్య సఖ్యత లేదని పలు సందర్భాల్లో స్పష్టంగానే కనిపిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ఢిల్లీకి పిలిపించిన రాహుల్ గాంధీ.. వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని రోజులు అంతా బాగానే ఉన్నట్టుగా కనిపించినా.. పార్టీలో అంతర్గత కుమ్ములాట మళ్లీ మొదటికే వచ్చింది. పార్టీలో చేరికల విషయంలో కూడా రేవంత్ రెడ్డిపై ఆయన వ్యతిరేక వర్గం నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. అయితే విమర్శలు చేస్తున్న నేతలు సైతం.. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందని.. సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకుంటామని చెబుతూ వచ్చారు.  

ఈ క్రమంలోనే పార్టీలో టీ కాంగ్రెస్‌లో రేవంత్ వర్గం, రేవంత్ వ్యతిరేక వర్గంగా విభజన వచ్చేసింది. రేవంత్ రెడ్డి వర్సెస్ జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కొనసాగుతూనే వచ్చింది. గాంధీ కుటుంబానికి దగ్గరి వ్యక్తిగా పేరున్న సీనియర్ నేత వీహెచ్ కూడా పలు సందర్భాల్లో రేవంత్ తీరుపై విమర్శలు చేశారు. అసలైన కాంగ్రెస్సోళ్లకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడా?.. పీసీసీ చీఫ్ పార్టీలో అందరిని కలుపుకుని పోవాలని సూచించారు.

ఏకతాటిపైకి వచ్చిన సీనియర్లు.. 
ఇన్నాళ్లు వ్యక్తిగతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినవారు, మనసులో అభిప్రాయాలను బయటపెట్టని వారు.. ఇలా సీనియర్లు అందరూ ఏకతాటి‌పైకి వచ్చారు. రేవంత్ రెడ్డికి  వ్యవహార శైలిపై అసంతృప్తిని వినిపించారు. రేవంత్ రెడ్డి పేరెత్తకుండానే.. ఆయనకు వ్యతిరేకంగా గళం వినిపించారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌ తీరుపై ఈ సమావేశంలో పాల్గొన్న నేతల్లో కొందరు పలు సందర్బాల్లో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలోనే రేవంత్, మాణిక్కం ఠాగూర్ వైఖరితో పాటు.. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే వారు సిద్దం అవుతున్నారు. ఇక, భట్టి విక్రమార్క నివాసంలో సమావేశం జరుగుతున్న సమయంలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఆయనకు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. ‘‘మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్న మీ వెంట ఉంటాను’’ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారితో అన్నట్టుగా సమాచారం.

Also Read: బలమైన నాయకులపై బద్నాం చేసేలా పోస్టులు.. పార్టీలో కుట్ర జరుగుతుందని నేతల్లో అనుమానాలు: భట్టి విక్రమార్క సంచలనం

ఇక పోరుబాటే..!
అసలైన కాంగ్రెస్ వాదులం తామేనని.. సేవ్ కాంగ్రెస్ కార్యక్రమంతో పార్టీని కాపాడుకుంటామని చెప్పారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు, న్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశం అని చెప్పారు. వలస వచ్చినవారు పార్టీని ఉద్దరిస్తారా అని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి అన్నారు. తీన్మార్ మల్లన్న సోషల్ మీడియా పోస్టును ప్రస్తావించిన ఉత్తమ్..  గలీజ్ సోషల్ మీడియా వ్యవహారం ఎవరూ చేస్తున్నారో తమకు తెలియదా? అని అన్నారు. మిగిలిన నాయకులు కూడా తమకు వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు వస్తున్నాయని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. కోవర్టులు అని ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను గమనిస్తే.. రేవంత్‌కు వ్యతిరేకంగా పోరుబాటు మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇప్పటికే తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని  కలిసేందుకు ప్రయత్నాలు జరుగున్నట్టుగా తెలుస్తోంది. అధిష్టానం నుంచి అపాయింట్‌మెంట్ ఖరారు అయితే ఢిల్లీ వెళ్లాలని భావిస్తున్నట్టుగా సమాచారం. 

కాంగ్రెస్ సీనియర్ నాయకుల చేసిన కొన్ని కామెంట్స్.. 
-కాంగ్రెస్‌ను నాశనం చేసేందుకు కుట్ర.. క్యారెక్టర్ లేని వారు పార్టీని నడిపిస్తున్నారు.. సోషల్ మీడియా ఖబర్దార్- మధుయాష్కీ
-కొంతమందిని అవమానించడానికే డీసీసీల ప్రకటన.. టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువ.. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి కాంగ్రెస్‌ను ఉద్దరిస్తాడా?-ఉత్తమ్ కుమార్ రెడ్డి
-మరియమ్మ‌కు న్యాయం జరగాలని సీఎంను కలిస్తే కోవర్టులు అని విషప్రచారం.. తమను ఎవడో బతికిస్తున్నట్టుగా పరిస్థితి ఉంది- జగ్గారెడ్డి
-కాంగ్రెస్‌ను హస్తగతం చేసుకోవడమో.. వేరే వాళ్లకు అప్పజెప్పే కుట్ర- మల్లు భటి విక్రమార్క
- నాలుగు పార్టీల్లో తిరిగి వచ్చిన చరిత్ర మాది కాదు.. కార్యకర్తలకు అన్యాయం జరగకూడదనే బాధ మాది- దామోదర రాజనర్సింహ

Follow Us:
Download App:
  • android
  • ios