గవర్నర్ మాటల్లో నిరాశ కన్పిస్తుంది: కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు
కేసీఆర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు నివేదిక ఇవ్వొచ్చు కదా అని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు గవర్నర్ ను ప్రశ్నించారు. గవర్నర్ మాటల్లో నిరాశ కన్పిస్తుందన్నారు.
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మాటల్లో నిరాశ కన్నిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు అభిప్రాయపడ్డారు.గురువారం నాడు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ఇంతలా చెబుతున్నా ప్రభుత్వం స్పందించదా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పై అమిత్ షాకు నివేదిక ఇవ్వొచ్చు కదా అని ఆయన గవర్నర్ కు సూచించారు.
గవర్నర్ లేఖలు రాస్తే పని కాదన్నారు. అవినీతికి పాల్పడిన సీఎం కేసీఆర్ ను జైల్లో పెడతామని అంటున్నారే కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని బీజేపీ నేతలను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై గవర్నర్ అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజా దర్భార్ పేరుతో ప్రజలను గవర్నర్ కలుస్తున్నారని తెలిపారు.కానీ కేసీఆర్ ప్రజలతో సహా ఎవరినీ కలవడం లేదని హనుమంతరావు చెప్పారు.
also read:రాజ్‌భవన్ ఏమైనా అంటరాని ప్రాంతామా?.. నిద్ర నటించే వాళ్లను ఏం చేయలేం: గవర్నర్ తమిళిసై
తెలంగాణలోని హాస్టల్స్‌లో విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదన్నారు. హాస్టల్స్ లో సరైన వసతులు లేక విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని వి. హనుమంతరావు గుర్తు చేశారు. భోజనం సరిగా లేని కారణంగా పాములు కరిచి విద్యార్ధులు మృతి చెందుతున్నారన్నారు. హస్టల్స్ లో సౌకర్యాలు మెరుగుపర్చాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ నంబర్ వన్ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.
తెలంగాణ గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత తమిళిసై సౌందర రాజన్ ఇవాళ రాజ్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. మూడేళ్లుగా తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ ఏ రకంగా తన పట్ల వ్యవహరించిందో ఆమె వివరించారు.తాను ప్రజల వద్దకు వెళ్లాలని భావించిన ప్రతి సారి తనను ఏదో రకంగా అడ్డంకులు సృష్టించారన్నారు. తన పరిధి ఏమిటో తనకు తెలుసునని చెప్పారు.తన మనో ధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరన్నారు. ఎట్ హోం కు వస్తానని కేసీఆర్ ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు తాను ప్రజల వద్దకు వెళ్తున్నట్టుగా ఆమె చెప్పారు.