కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి వి హన్మంత రావు మరోసారి సొంత పార్టీ నాయకులపై గరం అయ్యారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇటీవల తాను నిరాహారదీక్ష చేస్తే ఇతర పార్టీల నాయకులు మద్దతుగా నిలిచారని అన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా తనకు మద్దతివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని...తనలాంటి వారు చేస్తుంటే వాటిని ప్రోత్సహించకుండా అవమానిస్తున్నారంటూ విహెచ్ మండిపడ్డారు. 

 అంబేద్కర్ జయంతికి ముందురోజే పంజాగుట్టలో ఆయన విగ్రహాన్ని తొలగించడంపై విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేదంటూ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించినట్లే అక్కడ వున్న రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఎందుకు తొలగించడం లేదంటూ మండిపడ్డారు. అంబేద్కర్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొంచెం కూడా గౌరవం లేదని... ఆయన జయంతి రోజు కనీసం పూలమాల వేయకుండా అవమానించారని వీహెచ్ పేర్కొన్నారు. 

గతంలో తెలంగాణ ప్రభుత్వం 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున నిర్మిస్తామని చెప్పి ఇప్పటివరకు పునాది కూడా వేయలేదని గుర్తు చేశారు. ఆ హామీని వెంటనే నెరవేర్చకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని తెలిపారు. అవసరమైతే అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రాణ త్యాగానికైనా సిద్దమని విహెచ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

సొంతపార్టీ కాంగ్రెస్‌పైనే వీహెచ్ సంచలన విమర్శలు