బీజేపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన కాంగ్రెస్ నేత, కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పరామర్శించారు. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన్ను మధ్యాహ్నం కలిసిన కేవీపీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

మరోవైపు వంశీచంద్ రెడ్డిపై బీజేపీ దాడి చేయడంపై మహాకూటమి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నాం టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ నేతలు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌ను కలిశారు.

వంశీచంద్‌పై దాడితో పాటు ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌, అల్లరి మూకల దాడుల విషయాన్ని రజత్‌ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల్లో ఎక్కడ చూసినా అధికార పార్టీ ఉల్లంఘనలు జరుగుతున్నాయని కూటమి నేతలు ఆరోపించారు. వంశీచంద్ రెడ్డిపై బీజేపీ దాడి అమానుషమని.. నీతిమాలిన చర్య అని వ్యాఖ్యానించారు.