Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ తిట్లపై రంగంలోకి కేటిఆర్

  • మూడున్నరేళ్ల తర్వాత స్పందించిన కేటిఆర్
  • లక్ష్మారెడ్డి పై విమర్శలకు కేటిఆర్ కౌంటర్
  • రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
Congress Revanth verbal assault spurs KTR into action

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మూడేళ్ల కాలంలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మీద, కేసిఆరర్ ఫ్యామిలీ మీద తీవ్రమైన పోరాటం చేస్తున్నాడు. సందు దొరికితే చాలు సిఎం ఫ్యామిలీని వివాదాల్లోకి గుంజే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు రేవంత్. అయితే ఆ విమర్శలపై సిఎం ఫ్యామిలీ ఏనాడూ స్పందించిన దాఖలాలు లేవు. కానీ తాజాగా మంత్రి కేటిఆర్ రేవంత్ వ్యాఖ్యలపై ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. అయితే ఆ కౌంటర్ దేనికంటే.. మంత్రి లక్ష్మారెడ్డి మీద రేవంత్ మాట్లాడిన మాటలకు ఇచ్చారు. మూడేళ్ల కాలంలో రేవంత్ ఒక్కడే వన్ సైడ్ వార్ అన్నట్లు విమర్శల వర్షం కురిపిస్తూ పోతున్నారు. కానీ కేసిఆర్ ఫ్యామిలీ స్పందించలేదు. కానీ... లక్ష్మారెడ్డి విషయంలో కేటిఆర్ ట్విట్టర్ వేదికగా బయటకు రావడం కొత్త రాజకీయ వాతావరణానికి తెర లేచింది.

గడిచిన మూడున్నరేళ్లలో.. అంతకుముందు రేవంత్ నోట కేసిఆర్ ఫ్యామిలీపై లేని మాట అంటూ లేదు. తిట్లు, ధూషణలు, విమర్శలు అన్నీ కలిపి కొట్టేశారు. వ్యక్తిగత ధూషణలకు సైతం దిగారు. చివరకు కేసిఆర్ మనవడు హిమాన్ష్ పై కూడా విమర్శల వర్షం కురిపించారు. కానీ ఏనాడే కేసిఆర్ ఫ్యామిలీ రెస్పాన్స్ కాలేదు. కౌంటర్ ఇవ్వలేదు. రేవంత్ వదల బొమ్మాలీ అన్నట్లు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారు. దమ్ముంటే నామీద కేసులేయండి అంటూ సవాళ్లు విసిరిన దాఖలాలున్నాయి. కేసిఆర్ వియ్యంకుడు మీద కూడా విమర్శలు గుప్పించారు. నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ తో ఉద్యోగంలో చేరి రిటైర్ అయిపోయారంటూ విమర్శలు చేశారు. దానికి కూడా కౌంటర్ లేదు. కారణమేమంటే రేవంత్ మాటలను తాము పట్టించుకోబొము అన్న సమాచారం అధికార పార్టీ నుంచి వచ్చేది. అన్నింటికీ ఒకే సమాధానం చెప్పేవారు. అదేమంటే.. ఓటుకు నోటు కేసులో దొరికిన ముద్దాయి మాటలకు విలువ లేదు అంటూ కొట్టిపారేసేవారు.

లక్ష్మారెడ్డి, రేవంత్ వివాదం రాష్ట్రంలో దుమారం రేపుతున్నది. దీనిపై పోలీసు కేసుల దాకా వచ్చింది పరిస్థితి. ఈ నేపథ్యంలో మణిశంకర్ అయ్యర్ మీద చర్యలు తీసుకున్నట్లు రేవంత్ మీద చర్యలు తీసుకుంటారా అంటూ కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు కేటిఆర్. ట్విట్టర్ ద్వారా ఈ సందేశం వదిలారు. అయితే దానికి రేవంత్ కూడా సమాధానమిచ్చారు. ట్విట్టర్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. లక్ష్మారెడ్డి లాంటి వాడిని సమర్ధించడంతోనే టీఆర్ఎస్ సంస్కృతి ఏమిటో అర్థమవుతోందన్నారు. కేటీఆర్ నాపై వ్యాఖ్యానించే ముందు లక్ష్మారెడ్డి ఏం మాట్లాడాడో వీడియో తెప్పించుకుని చూస్తే మంచిదన్నారు. నాపై లక్ష్మారెడ్డి వ్యాఖ్యలను ట్విట్టర్ మంత్రి కేటీఆర్ సమర్ధిస్తున్నారా? అని ప్రశ్నించారు. నాపై నోరు పారేసుకున్న లక్ష్మారెడ్డి పై చర్యలు తీసుకుని తర్వాత నా గురించి మాట్లాడాలన్నారు.

మొత్తానికి ఇంతకాలం రేవంత్ వ్యాఖ్యల గురించి పట్టించుకోకుండా వదిలేసిన కేసిఆర్ ఫ్యామిలీ తొలిసారి రేవంత్ కామెంట్స్ పై స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే.. కేసిఆర్ ఫ్యామిలీపై విమర్శల సమయంలో స్పందించడం కంటే... సహచర మంత్రి లక్ష్మారెడ్డి విషయంలో స్పందించడం చూస్తే.. తన సహచర మంత్రికి ధైర్యం చెప్పే ప్రయత్నంలో భాగమే అని టిఆర్ఎస్ కు చెందిన ఒక నాయకుడు తెలిపారు. దాంతోపాటు టిఆర్ఎస్ పార్టీలోనే అత్యంత సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న లక్ష్మారెడ్డి ని రేవంత్ విమర్శించడాన్ని కౌంటర్ చేయడం ద్వారా రేవంత్ ను ఎక్స్ పోజ్ చేయొచ్చన్న ప్లాన్ కూడా ఉందంటున్నారు. టిడిపిలో ఉన్నంత కాలం రేవంత్ కామెంట్ల మీద కేసిఆర్ కుటుంబం మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత స్పందించడం మాత్రం ప్రాధాన్యతను సంతరించుకున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios