కళాకారులను సమీకరించే పనిలో తెలంగాణ కాంగ్రెస్ సాంస్కృతిక సేనాని పేరుతో నిర్మాణం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో కమిటీలు ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యం అంటున్న కాంగ్రెస్  

తెలంగాణ వచ్చిన తర్వాత కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, జర్నలిస్టులు అందరూ కెసిఆర్ వైపు నిలిచారు. కెసిఆర్ ను కీర్తిస్తూ కవితలు, పాటలు, రాతలు రాస్తున్నారు. కేసిఆర్ పాలనను వేనోళ్ల పొగుడుతున్నారు. వారిలో చాలా మందికి సర్కారు కొలువులు కూడా దక్కినయి. ఇక తెలంగాణ సర్కారును విమర్శిస్తూ వచ్చిన పాటలు తక్కువే. రాతలు తక్కువే. కవితలు తక్కువే. కారణం ఈ శక్తులన్నీ కెసిఆర్ గుప్పిట్లో ఉండిపోయాయి.

ఈ కారణంతో తెలంగాణలో ప్రభుత్వంపై విమర్శలు చేసే వారు కరువయ్యారు. ప్రజల సమస్యలపై పాడేవారు లేరు, రాసేవారు లేరు, కవితలు వెదజల్లే వారు కూడా లేరు. గత మూడేళ్ల కాలంలో ఇదే తరహా వ్యవహారం నడించింది. కానీ ఇప్పుడిప్పుడే పాట గొంతు పెకులుతున్నది. ప్రజా సమస్యలపై కొత్త కలాలు కొత్త కవులు పుట్టుకొస్తున్నారు. సర్కారు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జనాలను చైతన్యం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఇలా పురుడు పోసుకున్న వారందరు అక్కొడొకరు, ఇక్కొడకరు అన్నట్లుగా ఉన్నారు. ఊరికొకరు, చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్లుగా వెలజల్లబడి ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ తాజాగా అలా దూరదూరంగా ఉన్న కవులు, కళాకారులు, రచయితలు, మేధావులందరినీ ఏకం చేసే పనికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ కాంగ్రెస్ సాంస్కృతిక సేనాని పేరుతో వారి పాటలు, రాతలు, మాటలు కవితలను జనాల్లోకి ప్రచారం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను సమకూర్చుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ.

ఇప్పుడిప్పుడే ప్రజా గొంతుకలు వినిపిస్తున్న నేపథ్యంలో వారికి అండగా నిలవడం ద్వారా సర్కారు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జనాలకు తెలియజేయాలన్న సంకల్పంతో ఉంది కాంగ్రెస్. రాష్ట్ర, జిల్లా, మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి వారి సేవలను జనాలకు చేరువ చేసేందుకు కసరత్తు జరుపుతున్నది తెలంగాణ కాంగ్రెస్.

తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ తరహా సాంస్కృతిక సేనాని వ్యవస్థకు పురుడు పోసినట్లు తెలంగాణ కాంగ్రెస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ ఏసియా నెట్ కు తెలిపారు. కెసిఆర్ పాలనలో ప్రజాసామ్యం అంతరించిపోతున్న తరుణంలో జనాలను చైతన్యం చేయడమే లక్ష్యంగా తాము ఈ పనికి పూనుకున్నట్లు చెప్పారు.