నల్లమలలో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆమ్రాబాద్ మండలం మన్నన్నూరులో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు.

దీంతో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణతో పాటు ఆందోళనలో పాల్గొన్న ఇతర నేతలను అరెస్ట్ చేసి తీగలపెంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

నేతలకు మద్ధతుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పీఎస్‌లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన జనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. యురేనియం తవ్వకాలను నిరసిస్తూ కాంగ్రెస్ సోమవారం నల్లమల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.