హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ తీసుకొంది. ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆ పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పగించనుంది.

ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల విషయమై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జీ మాణికం ఠాగూర్ ఆదివారం నాడు మరోసారి ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. నియోజకవర్గంలో ని 146 గ్రామాలున్నాయి.ప్రతి గ్రామానికి ఒక కాంగ్రెస్ పార్టీ నేతను ఇంఛార్జీగా నియమించనుంది ఆ పార్టీ నాయకత్వం. ఈ మేరకు పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించనున్నారు. ఎన్నికల ప్రచారం పూర్తయ్యేవరకు పార్టీ నేతలు తమకు కేటాయించిన గ్రామాల్లోనే బస చేయనున్నారు.

పీసీసీ చీఫ్ నుండి ఇతర కిందిస్థాయి గ్రామ స్థాయి నేతలకు ఈ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించనున్నారు.ఈ మేరకు నేతల జాబితాలను పీసీసీ సిద్దం చేసింది.ఈ నెల 8వ తేదీన కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు కేటాయించిన గ్రామంలోకి వెళ్లాల్సి ఉంటుంది.

also read:దుబ్బాక ఉపఎన్నికలు: అభ్యర్థులపైనే అందరి దృష్టి

ఆయా గ్రామాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది... ప్రత్యర్ది పార్టీల బలబలాలు ఏమిటనే విషయమై కాంగ్రెస్ నేతలు అంచనా వేయనున్నారు. దీనికి అనుగుణంగా పార్టీ నాయకత్వం వ్యూహా ప్రతివ్యూహాలను సిద్దం చేయనున్నారు.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని కాంగ్రెస్ పార్టీ ఈ నెల 5వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది.