Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక కిక్కుతో తెలంగాణ కాంగ్రెస్ దూకుడు.. వరుస సభలతో జోరు

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయం రగిలించిన ఉత్తేజం, ఉత్సాహాన్ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తున్నది. ఇందులో భాగంగానే తెలంగాణలో మరో సభ జడ్చర్లలో నిర్వహిస్తున్నారు.
 

congress party to hold various meets in telangana to continue karnataka win fervour till TS assembly elections kms
Author
First Published May 20, 2023, 6:19 PM IST

హైదరాబాద్: అజేయుడని భావించిన ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా శాయశక్తుల ప్రయత్నించినా.. కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌కు ఒక కిక్కు ఇచ్చింది. ఈ విజయపు గాలులను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు ఇలాగే కొనసాగించాలని టీపీసీసీ పట్టుదలగా కనిపిస్తున్నది. అందుకే వరుస సభలు నిర్వహిస్తూ కర్ణాటక జోష్‌ను కొనసాగించే ప్రయత్నాల్లో ఉన్నది. ఇందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్లలో ఈ నెల 25వ తేదీన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ను ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. పీపుల్స్ మార్చ్‌లో భాగంగా రాష్ట్రంలో మూడు చోట్ల సభలు నిర్వహించాలని ఇది వరకే కాంగ్రెస్ నిర్ణయించుకుంది. తొలి సభను మంచిర్యాలలో సత్యాగ్రహ సభ పేరిట నిర్వహించారు. ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ముఖ్య అతిథిగా విచ్చేశాడు. జడ్చర్లలో నిర్వహించే సభ రెండోది. ఈ సభకు రంగారెడ్డి జిల్లా, నల్లగొండ జిల్లాల నుంచి జన సమీకరణకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.

ఇదిలా ఉండగా ఈ నెల 8న సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీతో యూత్ డిక్లరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సభ సక్సెస్ అయింది. యువత, నిరుద్యోగం అంశాలు కావడంతో కాంగ్రెస్ పై విమర్శలు చేయడం కూడా మిగితా పార్టీలకు కష్టంగా తోచింది.

యూత్ డిక్లరేషన్ సక్సెస్ కావడంతో హుషారు మీదున్న కాంగ్రెస్ పార్టీ మరిన్ని డిక్లరేషన్‌లు ప్రకటించాలని భావిస్తున్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల కోసం డిక్లరేషన్‌లు ప్రకటిస్తామని సరూర్ నగర్ సభలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయా వర్గాలకు చేకూర్చే ప్రయోజనాల గురించి అందులో మాట్లాడుతామని చెప్పారు. మహిళా డిక్లరేషన్ సభకు సోనియా గాంధీని, బీసీ డిక్లరేషన్ సభకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని ఆలోచనలు చేస్తున్నారు. ఈ సభల గురించి మాట్లాడటానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో అపాయింట్‌‌మెంట్‌కు ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది.

Also Read: ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీని ప్రత్యక్షంగా కలిసిన ప్రధాని మోడీ.. రష్యా యుద్ధం తర్వాత తొలిసారి కలయిక

కర్ణాటక మాడల్:

ఎన్నికలకు నెలల ముందే అభ్యర్థులను ఎంపిక చేస్తే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని కర్ణాటక మాదిరి ఫార్ములాపై నజర్ పెట్టారు. ఆరు నెలల ముందే వీలైనంత మంది అభ్యర్థులను ఖరారు చేస్తే ఎలక్షన్లు పూర్తిస్థాయిలో సిద్ధం కావడానికి వీలు చిక్కుతుందని భావిస్తున్నారు. ఆగస్టులోపే 45 నుంచి 50 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

చేరికల కమిటీ

ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తున్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతోపాటు బీజేపీ నేతలు ఈటల, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలను కాంగ్రెస్‌లోకి రేవంత్ ఆహ్వానించారు. పార్టీలో చేరకానికి తానే అడ్డుగా ఉన్నారని భావిస్తే పది అడుగులు వెనక్కి వేయడానికి కూడా రెడీగా ఉన్నా అని వివరించారు. 

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ చేరికల కమిటీ వేయాలని, దాన్ని పరిపుష్టం చేయాలని కాంగ్రెస్ భావించింది. జానారెడ్డి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనతోపాటు మరికొందరు సీనియర్ నేతలను బరిలోకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios