ఖమ్మం: కాంగ్రెస్ పార్టీతో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలను వివాదాలు చుట్టుముడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ప్రజలు దారిపొడవునా అడ్డుకుంటూ నిరసన తెలుపుతున్నారు. తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావును వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేగా కాంతారావును ప్రజలు అడ్డుకున్నారు. ప్రచారానికి ఎందుకు వచ్చారంటూ విరుచుకుపడ్డారు. 

ఈ ఘటన మరువకముందే మరో షాక్ ఇచ్చారు పినపాక నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. పినపాక నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఛీటింగ్ చేశారంటూ మణగూరులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బూరుగుల నరసయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫామ్ పొంది ఓటర్లను నమ్మించి గెలిచి పార్టీ మారిన రేగాపై చీటింగ్ కేసు నమోదు చెయ్యాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఇదే పరిస్థితి ఎదురైంది. పార్టీ ఫిరాయించిన వనమాపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.