వివేక్ కుటుంబానికి కాంగ్రెస్ ఆఫర్.. రేవంత్ చర్చలు.. చెన్నూరు టికెట్ వంశీకి ఇచ్చేందుకు ఒకే..?
మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్‌లో చేరతారని కొంతకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్‌లో చేరతారని కొంతకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించినప్పటికీ.. బీజేపీ అగ్రనేతల సభలకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో ఆ ప్రచారానికి తెరపడటం లేదు. తాజాగా వివేక్ వెంకటస్వామితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ పరిధిలోని వివేక్ వ్యవసాయ క్షేత్రానికి రేవంత్ వెళ్లారు. అక్కడ ఇరువురు నేతల మధ్య సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది.
వివేక్‌తో భేటీ సందర్భంగా ఆయనను కాంగ్రెస్‌లోని రావాల్సిందిగా రేవంత్ ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా పలు అంశాలపై కూడా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. దీంతో వివేక్ కాంగ్రెస్ గూటికి చేరడం దాదాపు ఖాయమనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే వివేక్ పార్టీలో చేరితే ఆయన తనయుడు వంశీకి చెన్నూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వివేక్‌కు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే పార్టీ మారే విషయంలో వివేక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.
ఇక, గతంలో చెన్నూరు నియోజకవర్గం నుంచి వివేక్ సోదరుడు వినోద్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం వినోద్ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఈసారి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ.. వినోద్‌కు బెల్లంపల్లి టికెట్ ఇచ్చింది.