భద్రాచలంలో వరద పరిస్ధితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం వరదల వెనుక విదేశీ కుట్ర వుందని.. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త విధానం వల్లే భారీ వర్షాలు వచ్చాయని ఆయన ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.  

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) క్లౌడ్ బరస్ట్ (cloudburst) వ్యాఖ్యలపై టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kumar reddy) మండిపడ్డారు. అంతర్జాతీయ కుట్రతో వరదలు వచ్చాయనేది సిల్లీగా వుందన్నారు. తెలంగాణ ప్రజల దృష్టి మరల్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు ఉత్తమ్. అటు తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) సైతం సీఎం వ్యాఖ్యలపై స్పందించారు. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర వుందనడం ఈ శతాబ్ధపు జోక్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని సంజయ్ మండిపడ్డారు. 

అంతకుముందు భద్రాచలం పట్టణంలో వరద పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడారు. వరదలు వచ్చినప్పుడల్లా భద్రాచలం వాసులు ముంపునకు గురికావడం బాధాకరమని కేసీఆర్ అన్నారు. శాశ్వత కాలనీల నిర్మాణం కోసం ఎత్తైన ప్రదేశాలను గుర్తించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నందుకు సీఎం అభినందించారు. వరద వచ్చినప్పుడల్లా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని తిరిగే పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకొంటామన్నారు. 

ALso REad:భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు, క్లౌడ్ బరస్ట్ అనుమానాలు: కేసీఆర్

కడెం ప్రాజెక్టుకు ఏనాడు రాని రీతిలో 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు.ఈ ప్రాజెక్టును దేవుడే కాపాడినట్టుగా కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలకు చెందిన వారు మన దేశంలో క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉందన్నారు. గతంలో కాశ్మీర్ లోని లడ్డాఖ్, ఆ తర్వాత ఉత్తరాఖండ్, ప్రస్తుతం గోదావరిపై క్లోడ్ బరస్ట్ చేశారనే అనుమానాలు కూడా ఉన్నాయన్నారు. దీని వెనుక వీదేశీ శక్తుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. క్లోడ్ బరస్ట్ అనే కొత్త పద్దతి వచ్చిందని చెబుతున్నారన్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు.